Farmer Rama Rao Cultivates 870 Acres in Tadikonda: వాతావరణ ప్రతికూల పరిస్థితులు, పెరిగిన పెట్టుబడులు, చీడపీడలు కష్టనష్టాలు భరించలేక వ్యవసాయమే వద్దు బాబోయ్ అనే రోజులివి. 10, 20 ఎకరాల్లో సాగు చేయడమే ప్రస్తుతం తలకుమించిన భారంగా మారింది. రేయింబవళ్లు కష్టపడి పండించినా లాభాల్లేక చాలా మంది కాడి వదిలేస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఏకంగా 870 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక సాగు విధానాలు అవలంబిస్తూ పెద్దఎత్తున ఆదాయం ఆర్జిస్తున్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు లాభాల పండుగ అని నిరూపిస్తున్నారు.
870 ఎకరాల్లో సాగు:గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన గోగినేని రామారావుకు వ్యవసాయంపై చాలా మక్కువ. తనకు 50 ఎకరాల పొలం ఉంది. సాగుపై తనకున్న ఇష్టానికి పొలం సరిపోవట్లేదని భావించి కౌలుకు తీసుకోవడం ప్రారంభించారు. అలా క్రమంగా పెంచుకుంటూ పోతూ ఇప్పుడు ఏకంగా 870 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేస్తూ మినుము, శనగ, మిర్చి, పత్తి, మొక్కజొన్న పండిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా సాగు చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఎలాగైనా మంచి దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సంకల్పించారు. అందుకోసం చాలా రిస్క్ తీసుకుని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
పెట్టుబడుల కోసం పొలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. మంచి రకాల విత్తనాలనే ఎంపిక చేసుకుంటారు. మార్కెట్లో పంటలకు ఉన్న ధరల్ని బట్టి వాటి విస్తీర్ణం ఖరారు చేసుకుని సాగు చేస్తున్నారు. సాగు విధానంలో ఎప్పటికప్పుడు వస్తున్న విధానాలను పాటిస్తున్నారు. పంటలకు యంత్రాలను ఉపయోగిస్తూ అవలీలగా వందల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. సొంతంగా 6 ట్రాక్టర్లు ఉండటంతో కోతలు, నూర్పిడులు, పంట రవాణా కోసం వీటిని వినియోగిస్తున్నారు.
కోనసీమ కొబ్బరికి మంచిరోజులొచ్చాయ్ - 9 వేల నుంచి 15 వేలకు పెరిగిన ధర