Fake Report and Land Illegal Registration In Kurnool District :భూములు కాజేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు అక్రమార్కులు. నకిలీ పత్రాలను అవలీలగా సృష్టిస్తూ ఆస్తులు కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి కుట్రే శనివారం వెలుగుచూసింది. భూమి యజమాని ఈశ్వరప్ప 2009లో చనిపోయినట్లు నిందితులు నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు సృష్టించారు. ఈశ్వరప్పకు చెందిన 6 ఎకరాల 51 సెంట్ల భూమిని గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు చెందిన చాకలి ఈరన్న పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఈ విషయాన్ని ఆన్‌లైన్‌లో గుర్తించిన ఈశ్వరప్ప కుమారుడు మోహన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బందిని నిలదీయగా అసలు విషయం వెలుగుచూసింది. న్యాయం చేయాలంటూ బాధితుడు ఈశ్వరప్ప, కుమారులు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రార్‌తోపాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదోని సబ్ రిజిస్ట్రార్ అవినీతి వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ఐజీ సహా ఇతర అధికారులతో చర్చించిన మంత్రి తక్షణం ఆదోని సబ్ రిజిస్ట్రార్‌తోపాటు అవినీతికి పాల్పడిన మిగిలిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు.