Excise Department Director Review on Liquor Policy Implementation:రాష్ట్రంలో నూతనంగా రానున్న ఎక్సైజ్ పాలసీ అమలుకు అబ్కారీ శాఖ సంసిద్దంగా ఉండాలని ఎక్సైజ్ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని యంత్రాంగాన్ని సిద్దం చేయాలని కమీషనరేట్ నుంచి నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతమున్న మద్యం డిపోలు, రిటైల్ అవుట్‌లెట్‌ల పనితీరును ఈ సందర్భంగా మదింపు చేశారు. ప్రధానంగా డిపోలు, ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌లలో నిల్వలను ఎప్పటి కప్పుడు అంచనా వేయాలని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా షాపులను నిర్దేశించిన సమయానికంటే ముందుగా మూసివేయటాన్ని అంగీకరించబోమని, తప్పని సరిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు నిర్వహించాలని అధికారులను తెలిపారు.
పాలసీ మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్‌లు ప్రైవేట్ నిర్వహణకు మారుతున్న పరిస్దితులలో రిటైల్ అవుట్‌లెట్‌ల వద్ద ఆస్తుల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, పీఓఎస్ మెషీన్‌లు, నగదు భద్రతా బీరువాలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాలకు సంబంధించి జాబితాలు సిద్దం చేయాలని అయా ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆపీసర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమస్యలను అధిగమించి అక్కడి ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని అన్నారు. అదేవిధంగా సమస్యాత్మకంగా గుర్తించబడిన ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షకు పలు జిల్లాల డిప్యూటీ కమిషనర్‌లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.