EDP Program in AP Youth :పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉన్నా, చేయూత కరవై ముందుడగు వేయలేని వివిధ వర్గాలకు చెందిన యువతకు బాసటగా నిలవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు :ఇందుకోసం హైదరాబాద్‌లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకోనుంది. అమలుకు సంబంధించి ఇప్పటికే ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ సంస్థతో ఆయాశాఖల అధికారులు చర్చలు ప్రారంభించారు. పరిశ్రమల సిలబస్‌కు అనుగుణంగా 4 లేదా 6 వారాలు శిక్షణ అందించనున్నారు. ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనున్నారు.
ఏటా రెండు వేల మందికి శిక్షణ :ఏటా 2,000ల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మంది ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా వర్గాల నుంచి ఒక్కొ బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. ఈడీపీ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.