Engineering Students Develop Electric Bike in Low Price At Vijayawada :ప్రస్తుత మార్కెట్‌లో విద్యుత్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ రేట్ల దృష్ట్యా చాలామంది ఈ వెహికిల్స్‌ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, వాటికి దాదాపు లక్ష రూపాయలు వెచ్చించడం అవసరమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకోసమనీ కేవలం రూ. 35 వేలకే ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశారు విజయవాడలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకులు. అవినాష్, మురళీ కృష్ణరెడ్డి రఘువరన్ B.Tech సినిమాలో హీరో ధనుష్ మాదిరి బైక్‌ను ఆవిష్కరించారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చిట్టి ఎలక్ట్రిక్ (Chitti Electric) పేరుతో చవకైన విద్యుత్ వాహనాన్ని తయారు చేశారు.
మార్కెట్‌లో దొరికే విద్యుత్ వాహనాలకు సమానంగా చిట్టి ఎలక్ట్రిక్ వెహికిల్‌ని తయారు చేశామని ఈ యువకులు అంటున్నారు. కేవలం 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అయ్యేలా రూపొందించామని వివరిస్తున్నారు. ఆఫ్ యూనిట్ ఛార్జింగ్ పెడితే దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కర్తలు. చిట్టి ఎలక్ట్రిక్ బైక్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచేలా తయారు చేశామని ఈ యువకులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో GPS వ్యవస్థతో ఏర్పాటు చేశామని, దాని ద్వారా ఏ దారిలో ఎంత దూరం ప్రయాణించామనే విషయాలను బైక్ (Bike) యజమానికి తెలియజేస్తుందని వివరిస్తున్నారు. కేవలం 35 వేలకే చిట్టి ఎలక్ట్రిక్ వెహికిల్‌ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని చెబుతున్నారు.
పదో తరగతి విద్యార్థి.. ఎలక్ట్రిక్ బైక్‌ను సృష్టించాడు!
'చిట్టి విద్యుత్ వాహనాన్ని తయారు చేయడానికి సుమారు 2 నెలల సమయం పట్టింది ఎలక్ట్రిక్ వెహికిల్ కావడం వల్ల రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటివి అవసరం లేదు. రైతులకు, డెలివరీ బాయ్స్‌కు ఉపయోగపడే విధంగా మరిన్ని ఫీచర్స్‌ని అందుబాటులోకి తేస్తాం. దాంతోపాటు గంటకు 100 కిలోమీటర్లు ప్రయాణించేలా నూతన సాంకేతికతను జోడించే ప్రయత్నంలో ఉన్నాం. మరో నాలుగు నెలల్లో దీన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతాం.'-అవినాష్, మురళీకృష్ణ, ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కర్తలు