500 Posts Filled In Endowment Department in AP:దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ క్యాడర్లలోని అధికారులు, అర్చకులకు సంబంధించిన ఐదు వందల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలన పరమైన సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయాలన్నీ పరిశుభ్రత, ఆధ్యాత్మికతలో కళకళలాడేట్లుగా అధికారులందరూ పని చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలు :రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉన్నదని దానిని కాపాడే విషయంలో నిర్లిప్తత కూడదని స్పష్టం ఆనం రామనారాయణ రెడ్డి చేశారు. కార్తిక మాసంలో నిర్దేశించిన ప్రాంతాల్లో చతుర్వేద సభలు నిర్వహించాలని ఆదేశించారు. గత నాలుగు నెలల కాలంలో దేవాదాయ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామని, ఇంత వరకు దేవాదాయ శాఖ అంటే చాలా చిన్నదిగా భావించే అందరి భ్రమలను తొలగిస్తూ ఈ శాఖ ఎంతో గొప్పది అనే విధంగా పేరు సాధించామని చెప్పారు. 50 వేలకు మించి ఆదాయం ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు పునరుద్ఘాటించారు. ఆలయాల ట్రస్టు బోర్డుల్లో అదనంగా ఇద్దరి సభ్యులను నియమించాలన్న నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్స్ త్వరలో జారీ అవుతుందని చెప్పారు. నిర్దేశిత కాల పరిమితితో, స్పష్టమైన మార్గదర్శకాలతో సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ వెలువరిస్తామని పేర్కొన్నారు.
గుడ్ న్యూస్ - వారి కనీస వేతనం పెంచిన ప్రభుత్వం
వేదాధ్యయనం చేసి, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న పండితులకు సంభావన పేరుతో నెలకు మూడు వేల రూపాయలను అందించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని, ఈ పథకం కింద గుర్తించిన సుమారు 600 మందికి త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ లబ్ధిని అందిస్తామన్నారు. దేవాలయాల్లో ప్రసాదం, అన్న ప్రసాదం తయారీలో ఏ గ్రేడ్ రకానికి చెందిన సామగ్రి వినియోగించాలని, ఇందుకు త్వరలో కేంద్రీకృత వ్యవస్థను తీసుకొచ్చేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఆలయాల్లో పారిశుద్ధ్య పనులు, భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా మానవ వనరుల వినియోగంలో కూడా కేంద్రీకృత విధానాలు తీసుకొస్తామన్నారు.
ఆలయాల ఆస్తులు పరిరక్షణ :ఇటీవల రాష్ట్రంలోని ప్రధానమైన దేవాలయాన్నిటిలోనూ ప్రసాదం రుచి గతంలో కంటే మెరుగ్గా ఉన్నట్లు భక్తులు చెబుతున్నారని, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీపడొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఆలయాల ఆస్తులు పరిరక్షణ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వివిధ రకాలుగా కబ్జా అయిన వాటి వివరాలతో ఓ నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తుల భూములను 22(ఎ) కింద గుర్తించినందు వల్ల, ఆయా వ్యక్తులు నష్టపోతున్నారని, దీనిని దేవాదాయ శాఖ అధికారులతో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని, జిల్లా కలెక్టర్ ద్వారా సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆనం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలోనూ ఆయా దేవతా మూర్తుల, నామ స్మరణ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు. ఈ సమీక్షలతో దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, అదనపు కమిషనర్లు చంద్రకుమార్, రామచంద్రమోహన్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేవాదాయశాఖ అర్చకులకు ఇక నుంచి రూ. 15 వేల వేతనం-సీఎం చంద్రబాబు - CBN Review on Endowments Department