AP Couple Stuck in Saudi : ఉపాధి నిమిత్తం ఏపీకి చెందిన ఓ దంపతులు సౌదీకి వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ విషయాన్ని భర్త విలపిస్తూ బంధులకు వీడియోను షేర్ చేశాడు. అంతే కాక తన భార్యను ఇక్కడ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పాస్‌పోర్టు లాక్కుని బయటకు తోసేశారని తెలిపాడు. జీతం అడుగుతుంటే కొడుతున్నారని, తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో కార్ల నీడలో కాలం గడుపుతున్నాని వాపోయాడు. కేవలం నీళ్లు తాగి బతుకుతున్నా, ఆకలితో చనిపోయేలా ఉన్నా కాపాడండని చెప్పాడు. తన భార్యను కూడా ఉద్యోగం పేరిట తీసుకువెళ్లారని, ఆమె ఆచూకీ తెలియడం లేదని వివరించాడు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నానని ఏలూరుకు చెందిన జుబేర్ సౌదీలోని రియాద్ నుంచి ఈ వీడియోను బంధువులకు పంపించాడు.
Eluru Person Tortured in Saudi : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏలూరుకు చెందిన జుబేర్, మెహరున్నీసాలు దంపతులు. వీరికి షేక్ పర్హానా (8), షేక్ షెహనాజ్ (6) ఇద్దరు ఆడపిల్లలు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు జుబేర్ సౌదీలోని రియాద్ నగరంలో డ్రైవర్‌గా పని చేశాడు. కొవిడ్ సమయంలో భారత్‌కు వచ్చాడు. తాజాగా ఉద్యోగం ఉందనడంతో 9 నెలల కిందట మళ్లీ అక్కడకి వెళ్లాడు. అక్కడ జుబేర్ పాస్‌పోర్ట్‌ను తీసుకుని ఉద్యోగం ఇచ్చారు.
భార్యకు కూడా ఉద్యోగం ఉందనడంతో జుబేర్ మెహరున్నీసాను అక్కడి పిలిపించాడు. ఆమెను ఉద్యోగం కోసం మస్కట్ దేశానికి పంపారు. వారానికి ఒక రోజు మాత్రమే ఫోన్‌లో మాట్లాడనిచ్చేవారని బాధితుడు చెబుతున్నాడు. జీతం ఇవ్వమని అడగడంతో, అతని పాస్‌పోర్టు లాక్కుని జీతం ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టారని వాపోయాడు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి 13 రోజులుగా రోడ్లపైనే తిరుగుతున్నట్లు, నీళ్లు మాత్రమే తాగుతూ కాలం గడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నానని కాపాడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.