CM Jagan Bus Yatra: సీఎం జగన్ నింగిలో వెళ్లినా నేలపై వెళ్లినా సామాన్య ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. రహదారిపై పర్యట అంటే చెట్లను కొట్టేయడం. ట్రాఫిక్ నియంత్రించడం, సీఎం సభలు సామావేశాలు జరిగే వరకూ జనజీవనానికి ఆటకం కలిగించడం పరిపాటిగా మారిపోయింది. ఇక సీఎం జగన్ సిద్దం బస్సు యాత్ర గురించి చెప్పనక్కర్లేదు. మద్యహ్నం జరిగే బస్సు యాత్ర కోసం ఉదయం నుంచే విద్యుత్‌ను నిలిపివేస్తున్నారు.
విద్యుత్ తీగలు తొలగించి సరఫరా నిలిపివేసి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర (siddham bus yatra ) తో సామాన్యులకు అవస్థలు తప్పడం లేదు. బస్సు యాత్ర కొనసాగే మార్గం పొడవునా పలుచోట్ల నిన్నటి నుంచే విద్యుత్ తీగలు కత్తిరించగా, ఏలూరు జిల్లా గణపవరం మండలంలో ఇవాళ ఉదయం నుంచి విద్యుత్ తీగలు తొలగించి సరఫరా నిలిపివేశారు. అసలే ఎండాకాలం కావడం, ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. యాత్ర ప్రారంభం కాకముందు నుంచే దుకాణాలు మూసి వేయించగా, గృహ సమదాయాలకు సైతం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ నిలిపివేయడంతో వ్యాపారాలు లేక దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు.
జగన్ ప్రచారం కోసం సామాన్య ప్రజలకు ఇబ్బందులు: గతంలో ఏంతో మంది సీఎంలు, ప్రముఖులు వచ్చినా, ఇలా ఎప్పుడూ విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనలు లేవని స్ధానికులు వాపోతున్నారు. సీఎం వస్తే ఇంతేనా అంటూ మండిపడుతున్నారు. సీఎం జగన్ (CM Jagan) ప్రచారం కోసం సామాన్య ప్రజల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కొన్ని చోట్ల ప్రజలు విద్యుత్ కోతలపై అధికారులను ప్రశ్నిస్తే, సరైన సమాధానం చెప్పడం లేదని తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ నిలిపి వేసినట్లు చెబుతున్నారు. ఎదైనా ఉంటే పై అధికారులతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
'ఉదయం ఆరుగంటల నుంచే విద్యుత్‌ను నిలిపివేశారు. విద్యుత్ లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం జగన్ పర్యటన ముగిసిన తరువాత సైతం విద్యుత్ ను పునరుద్దరిస్తారా? లేదా అనేదానిపై సమాచారం లేదు. విద్యుత్ తీగలు సీఎం బస్సుకు అడ్డంగా వస్తున్నాయని విద్యుత్ నిలిపివేశారు. గతంలో అనేక మంది నేతలు ప్రచారానికి వచ్చినా, ఇంతలా ఇబ్బందులకు గురికాలేదు. సీఎం పర్యటన కోసం రోడ్డుపై ఉన్న చెట్లను సైతం కొట్టారు. మా మండలం మెుత్తం విద్యుత్ నిలిపివేశారు. ఉదయం నుంచి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.' - గణపవరం ప్రజలు
ఇదేమీ తీరు: భీమవరంలో ఇవాళ మేమంతా సిద్ధం సభ జరగనుంది. సీఎం బస్సు యాత్ర జరిగే భీమవరం ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లను వేళ్లతో సహా పెకలించేశారు. అంతే కాకుండా విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లను సైతం తొలగించేశారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం రోడ్డుకు ఇరువైపులా ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న చెట్లను అధికారులు తొలగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వస్తున్నారంటే చాలు వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలతో తిప్పలు తప్పడం లేదు. సీఎం జగన్ సభ ఎక్కడ ఉంటే అక్కడికి బస్సులను తరలించడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ముఖ్యమంత్రులు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసినప్పటకీ ఇంతటి విధ్వంసం ఎవరూ చేయలేదని ప్రజలు మండిపడుతున్నారు.
ఇరువైపులా చెట్లు నరికివేత