Earthquake in Prakasam District:ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ఎక్కువగా చోటుచేసుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా ఇవాళప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం సంభవించింది. 24 గంటల్లో రెండోసారి జిల్లాలో భూమి కంపించడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ ముండ్లమూరు మండలంలో సెకన్ పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వచ్చామని స్థానికులు తెలిపారు.
శనివారం కూడా ఇదే ప్రాంతంలో ముండ్లమూరు, తాళ్లూరు మండాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. ముండ్లమూరు, పసుపుగల్లులో వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, గంగవరం, రామభద్రాపురం, శంకరాపురంలో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలోనే ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. పలు గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్ని కదిలాయి. ఈరోజు కూడా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.