Krishna River Become Dumping Yard: విజయవాడ వెళ్లినప్పుడు కృష్ణా నదికి వెళ్లి అలా తీరం ఒడ్డున కూర్చొని, కృష్ణమ్మ సోయగాలను చూస్తూ చల్లని గాలులు ఆస్వాదిస్తే ఆ మజానే వేరు. బోటు షికారు చేస్తూ అలలపై తేలియాడితే స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కృష్ణా నది ఒడ్డున అలాంటి మధురానుభూతులు పొందాలనుకుంటే కచ్చితంగా చేదు అనుభవమే ఎదురవుతుంది. ఘాట్లలోకి దిగి పవిత్ర స్నానాలు చేద్దామంటే పుణ్యమేమోగానీ అనారోగ్యం తప్పదు! అసలు మనము నదికి వచ్చామా? లేక మురికికూపం వద్దకు వచ్చామా అనే సందేహం కలగక మానదు.
డంపింగ్ యార్డులా మారిపోయిన తీరం: ఓ వైపు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలు, మరోవైపు మురుగు నీటిలో ఉన్న పశువుల గుంపు. ఈ దృశ్యాలు చూస్తే ఏ మారుమూల పల్లెలో ఉన్న చెరువో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఎంతో పవిత్రమైన కృష్ణా నదీ తీరం. పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో కానీ కృష్ణా నది పరివాహక ప్రాంతం కాలుష్య కాసారంగా మారిపోయింది. స్వచ్ఛత, పరిశుభ్రత చర్యల ఊసే లేదు. పూలదండలు, గాజు పెంకులు, ప్రమిదలు, ఎక్కడలేని చెత్తంతా ఇక్కడే పేరుకుపోతోంది.
స్నానాలు చేసేందుకు జంకుతున్న ప్రజలు: వ్యర్థాలతో తీరం డంపింగ్ యార్డులా మారిపోయింది. అటువైపు వెళ్తుంటే భరించలేని కంపు. పర్యాటకులు, సందర్శకులు వచ్చే విధంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు అసలు పట్టించుకోవడమే లేదు. కృష్ణా నది ప్రక్షాళనను పూర్తిగా గాలికొదిలేశారు. భవానీ ఘాట్, పున్నమిఘాట్ పరివాహక ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. నదిలో మూడు మునకలు వేద్దామంటే ఏ జబ్బు బారినపడతామోననే భయం. స్వచ్ఛమైన నదీ జలాలు కలుషితమవ్వడం కనీసం పరిశుభ్రతా చర్యలు లేకపోవడంతో ఇక్కడకు వచ్చేందుకు సందర్శకులు జంకుతున్నారు.
ప్రకాశం బ్యారేజీ దిగువన పరిస్థితి మరింత దారుణం. రక్షణ గోడ తర్వాత యనమలకుదురు వద్ద కృష్ణా నది కనుచూపు మేర చెత్తాచెదారంతో నిండిపోయింది. తాగేసిన కొబ్బరిబొండాలు, భవన నిర్మాణ శిథిలాలు పడేస్తున్నారు. గుంతలు మురికికూపాలుగా మారి వాటిలోనే గేదెలు, పందులు సేదతీరుతున్నాయి.