ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దాహమో రామచంద్రా' అంటున్న సీఎం సొంత జిల్లా వాసులు- దశాబ్ద కాలంగా చూడని నీటి కష్టాలు - Drinking Water Problem in Mydukur

Drinking Water Problem in Mydukur of YSR District : 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్న చందంగా మారింది ముఖ్యమంత్రి సొంత జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ప్రజల పరిస్థితి. పట్టణం నలువైపులా నదులున్నా శాశ్వత తాగునీటి చర్యలు చేపట్టలేని దుస్థితి పాలకులది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

Drinking_Water_Problem_in_Mydukur_of_YSR_District
Drinking_Water_Problem_in_Mydukur_of_YSR_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 4:16 PM IST

Drinking Water Problem in Mydukur of YSR District :పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా వైఎస్సార్ జిల్లా మైదుకూరు ప్రజలు 'దాహమో రామచంద్రా' అనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని వైసీపీ ప్రజాప్రతినిధుల ముందుచూపులేమితోనే ప్రజలు తీవ్ర తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. దశాబ్ధాల కాలం నుంచి ఫిబ్రవరి సమయంలో కుందూ నది ఎండి పోయిన చరిత్ర లేదు. ప్రస్తుతం నదులు వట్టిపోవడంతో మైదుకూరుకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. నెలరోజుల నుంచి మంచినీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బెంగళూరులో నీటి సమస్య తీవ్రం- ఫేస్ వాష్ కోసం వెట్‌ వైప్స్- అలా చేయకపోతే రూ.5వేల ఫైన్!

మైదుకూరలో ఏ ఇంటికి వెళ్లిన ముందుగా డ్రమ్ములే దర్శనమిస్తాయి. దీన్ని బట్టి చూస్తే మైదుకూరు మున్సిపాలిటీ ప్రజల తాగునీటి కష్టాలు ఏ విధంగా ఉన్నయో అర్థం అవుతుంది. ఒక్కో కుటుంబం వెయ్యి రూపాయలతో ప్లాస్టిక్ డ్రమ్ము కొనుగోలు చేసి ఇంటివాకిట ముందు పెట్టుకుని మంచినీటి ట్యాంకర్ కోసం ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితి. మైదుకూరు పట్టణం నలువైపులా పెన్నానది, కుందూ నది, కేసీకాల్వ, తెలుగుగంగ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నదులన్నీ మైదుకూరు వాసుల తాగునీటి కష్టాలు తీర్చలేక పోతున్నాయి. కారణం పాలకులకు ముందుచూపు లేకపోవడం.

Water Crisis in AP :ప్రణాళిక బద్ధంగా పనిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో ఉండటమే ఇపుడు పట్టణవాసులంతా 'దాహమో రామచంద్రా' అనే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 60 వేలకు పైగానే ఉన్న మైదుకూరు జనాభాకు నిత్యం 70 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఈ మున్సిపాలిటీకి ఎలాంటి శాశ్వత తాగునీటి పరిష్కారం లేదు. కేవలం ఎక్కడికక్కడ కాలనీల్లో దశాబ్ధాల కిందట వేసిన బోర్లద్వారానే నీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

పనికి వెళ్లాలా? నీళ్లు పట్టుకునేందుకు కాపలా ఉండాలా! - తాగునీటి కష్టాలపై బందరు మహిళల ఆగ్రహం

ఈ విధంగా పట్టణంలో 50 వరకు బోర్లు వేశారు. అయితే ఖరీఫ్​లో వర్షాలు లేకపోవడంతో జలాశయాలు, నదులు అడుగంటాయి. పట్టణానికి సమీపంలోనే ఉన్నా పెన్నానదిలో చుక్కనీరు లేదు. కుందూ నది చరిత్రలో తొలిసారిగా వట్టిపోయింది. కేసీ కాల్వ సంగతి సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాభావం వెంటాడటంతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. పట్టణంలో 700 అడుగుల లోతు వరకు వేసిన బోర్లన్నీ అడుగంటాయి. ఉన్న 50 బోర్లలో సగానికి పైగా బోర్లలో నీళ్లు రావడం లేదు. ఫలితంగా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

"కుళాయిలకు నీళ్లు రాకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోనే దుస్థితి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ట్యాంకర్లతో వచ్చే నీటినే తాగుతున్నాం. దాదాపు 20 రోజుల నుంచి మైదుకూరుకు మంచినీటి ట్యాంకర్లే దిక్కయ్యాయి. పట్టణానికి రోజుకు 30 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీ వాసులంతా ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మాకు కావాల్సినన్ని నీళ్లు నింపుకోవడానికి వీలులేదు."

- మాబూచాన్, స్థానికురాలు

"ప్రతి ఇంట్లో ఓ ప్లాస్టిక్ డ్రమ్ముతో నీరు నింపుకుంటున్నాం. ఎంతమంది కుటుంబ సభ్యులున్నా సరే వారందరికీ ఒకే డ్రమ్ము నీటిని అందిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా ఇంటిముందు ఖాళీ డ్రమ్ము పెట్టుకుని ట్యాంకర్ కోసం ఎదురు చూస్తున్నాము. కొంతమంది దగ్గర నీటి డ్రమ్ములు కొనడానికి కూడా డబ్బులు లేవు. అలాంటివారు ఇంట్లో ఉన్న బిందెలు, బకెట్లకు నీటిని నింపుకుంటున్నారు. పదేళ్లుగా ఇలాంటి కష్టాలు ఎప్పుడు ఎదురు కాలేదు. చుట్టూ నదులున్నా ఎందుకు పైపులైన్ల ద్వారా నీటిని తరలించలేక పోతున్నారో అర్థం కావటం లేదు."

- హుసేన్​బీ, స్థానికురాలు

"2017లో మైదుకూరు మున్సిపాలిటికి నీటిని తరలించేందుకు శంకుస్థాపనలు చేసినా గుత్తేదారులు చేతులెత్తేయడంతో పథకం అటకెక్కింది. పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం."

-రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే

భూగర్భజలాలు అడుగంటిపోవడంతో మైదుకూరులోని పలు కాలనీలకు నీటి సమస్య నెలరోజుల నుంచి ఎదురైంది. ప్రధానంగా సర్వాయపల్లె, కేసీనగర్, బాలాజీనగర్, రాయప్పగారిపల్లె, దస్తగిరిపేట, సాయినాథపురం, సరస్వతిపల్లె తదితర కాలనీల్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది. ఈ కాలనీల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా జీవిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వీరిది. ఇలాంటి పేద, మధ్యతరగతి వర్గాలకు నీటి కష్టాలు ఎదురవ్వడంతో ఆందోళన చెందుతున్నారు. మైదుకూరు పట్టణంలో తాగునీటికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు..ఒక్కో బావిపై 50వరకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు

'దాహమో రామచంద్రా' అంటున్న ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రజలు - దశాబ్ద కాలంగా చూడని దుస్థితి

ABOUT THE AUTHOR

...view details