Dr Challa Krishnaveer Abhishek Won World Record :ప్రముఖ భాషావేత్త, డీన్ వాన్ లీవెన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందుకున్నారు. శనివారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. నరసింహారావు చల్లా కృష్ణవీర్ను అభినందించి అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చల్లా కృష్ణవీర్ సాహిత్య రంగంలో చేసిన సేవలను నరసింహారావు కొనియాడారు.
సాహిత్య రంగంలో విశేష కృషి : సాంస్కృతిక మరియు భాషాపరమైన అడ్డంకులను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అధిగమించారని ప్రొఫెసర్ నరసింహారావు తెలిపారు. దీంతో ఏకీకృత సాధనగా భాషా సమ్మిళితల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారన్నారు. చల్లా కృష్ణవీర్ అద్భుతమైన సాహిత్య కృషికి గుర్తింపు పొందిన తెలుగు-ఇంగ్లీష్ క్రియోల్ పిడ్జిన్‌లో మొట్టమొదటి పుస్తకాన్ని రచించారని గుర్తు చేశారు. దీనిని ప్రముఖంగా తెంగ్లీష్ అని పిలుస్తారని వెల్లడించారు.
ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక మరియు భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించే భాషల యొక్క ప్రత్యేక సమ్మేళనమని ప్రొఫెసర్ నరసింహా రావు వివరించారు. క్రియోల్ మరియు పిడ్జిన్ అంశాలతో కూడిన తెలుగు-ఇంగ్లీషుల హైబ్రిడ్ అయిన తెంగ్లీష్ తరచుగా సాహిత్య మాధ్యమంగా కాకుండా సంభాషణా సాధనంగా పరిగణించబడుతుందని వెల్లడించారు. డాక్టర్ అభిషేక్ పుస్తకం ప్రజలను ఏకం చేయడానికే గాక భాష మరియు సాహిత్యానికి ఉన్న శక్తిని గుర్తు చేస్తుందని తెలిపారు.