ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భలే మంచి బేరం' - హైదరాబాద్​లో సొంతింటి కల నెరవేర్చుకోండిలా! - DOUBLE BEDROOM HOUSES IN HYDERABAD

మార్కెట్లో భారీగా డబుల్ బెడ్​ రూమ్ ఇళ్లు - ధరల తగ్గింపుతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి అవకాశం

double_bedroom_houses
double_bedroom_houses (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2024, 5:48 PM IST

Double Bedroom Houses in Hyderabad: హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రస్తుతం ట్రిపుల్ బెడ్​ రూమ్ ఇళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కొత్త ప్రాజెక్టులలో వీటిని బిల్డర్లు వేగంగా అమ్మగలుగుతున్నారు. చాలా ప్రాజెక్టుల్లో ప్రారంభంలోనే ఇళ్ల బుకింగ్స్‌ పూర్తవుతున్నాయి. ఈ అనుభవాలతో అధిక శాతం బిల్డర్లు పూర్తిగా మూడు అంతకంటే ఎక్కువ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు విక్రయించడం కాస్త కష్టంగా ఉందని బిల్డర్లు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నిర్మాణం పూర్తయిన, పూర్తి కాబొతున్న ప్రాజెక్టుల్లో వీటి లభ్యత అధికంగా ఉంది. ఇల్లు కొనాలనుకుంటున్న వారు విస్తీర్ణంపరంగా కాస్త రాజీ పడితే సొంతింటి కల నెరవేరుతుంది.

సిద్ధంగా ఉన్న ఇళ్ల కోసం చూస్తుంటే డబుల్ బెడ్ రూమ్ విభాగంలో అనేక ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 800 నుంచి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇళ్లు ఉంటున్నాయి. విస్తీర్ణాన్ని బట్టి ధరలు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్యలో పలుకుతున్నాయి. ఐటీ కారిడార్‌ దగ్గర నుంచి హైదరాబాద్​లోని తూర్పు, దక్షిణం, ఉత్తర ప్రాంతాల్లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు చాలా ఉన్నాయని బిల్డర్లు చెప్తున్నారు.

పలు సానుకూలతలు ఉన్నాయి:

  • నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పోలిస్తే సిద్ధంగా ఉన్న వాటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌ స్తబ్ధుగా ఉండటంతో బిల్డర్లు ధరలను తగ్గించి అమ్ముకాలు జరుపుతున్నారు.
  • నిజంగా ఇల్లు కొనాలనే ఉద్దేశం ఉన్న వారు వస్తే బిల్డర్లు అనువుగా స్పందిస్తున్నారు. చెల్లింపుల పరంగానూ పలు వెసులుబాట్లు కల్పిస్తున్నారు.
  • ప్రాజెక్ట్‌ ప్రారంభంలో ఫ్లాట్ గురించి కాగితాల్లో, వీఆర్‌లో తప్ప ఎలా ఉంటుందో కచ్చితంగా తెలిసే అవకాశం ఉండదు. పూర్తయిన వాటిలో స్వయంగా పరిశీలించి అనుకూలంగా కొనుగోలు చేయవచ్చు.
  • పూర్తయిన, పూర్తి కాబోతున్న నిర్మాణాలు కాబట్టి నాణ్యత తెలిసిపోతుంది. బ్రోచర్‌లో తెలిపిన విధంగానే ఇల్లు కట్టారా లేదా అనేది కూడా సులువుగా గమనించవచ్చు.
  • పనులు చివరి దశలో ఉండగానే కొంతమంది గృహ ప్రవేశాలు చేస్తుంటారు. వారితో మాట్లాడి ఇళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. సమస్యల పరిష్కారంపై బిల్డర్‌ స్పందిస్తున్న తీరును బట్టి కొనాలా వద్దా అనేదీ ఆలోచించుకోవచ్చు.
  • వెంటనే ఇంట్లోకి మారిపోవచ్చు కాబట్టి అద్దె, ఈఎంఐ లాంటి భారాలు, ఇబ్బందులు ఉండవు. అద్దెకు మరికొంత సొమ్ము కలిపి కట్టగలిగితే ఇంటి ఈఎంఐ కట్టేయవచ్చు.
  • ఆదాయానికి తగ్గట్టుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రుణం పొందడం పెద్దకష్టం కాదు. పిల్లల విద్య, వైద్యం, ఇతర అవసరాలపరంగా రాజీలేకుండా ఇంటి వాయిదాలు చెల్లించవచ్చు.
  • తక్కువ విస్తీర్ణమైనందున కమ్యూనిటీలో మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి. నెలనెలా చెల్లించడం పెద్ద భారం కాదు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ నివాసం సరిపోతుందని డెవలపర్లు చెప్తున్నారు. ఇలాంటి ఫ్యామిలీలను దృష్టిలో పెట్టుకునే నిర్మిస్తుంటామని చెబుతున్నారు.
  • స్థిరమైన అద్దె ఆదాయం కోసం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ మేలు అనే అభిప్రాయం కొనుగోలుదారుల్లో ఉంది. ఇలాంటి వారు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో బిల్డర్లు రాయితీలు ఇవ్వడంతో ఫ్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

సెకండ్స్‌లోనూ తీసుకోవచ్చు:ఇంటి అప్‌గ్రెడేషన్‌ కోసం చాలా మంది ఇప్పుడున్న డబుల్ బెడ్ రూమ్ విక్రయించి అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే నివాసాలకు మారుతున్నారు. కొంత మంది తమ పాత ఇళ్లను అద్దెకు ఇస్తుంటే ఇంకొంత మంది వీటిని విక్రయిస్తున్నారు. దీంతో సెకండ్స్‌లోనూ డబుల్ బెడ్ రూమ్ నివాసాల లభ్యత అధికంగా ఉంటోంది. పాతవైనా ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇవి ఉండటంతో కొనుగోలుదారులు అవి కొనడానికి మొగ్గు చూపుతున్నారు.

తెలియక చేసే ఈ పనులతో మీ ఇల్లు కాలుష్యంతో నిండిపోతోందట! - ఈ జాగ్రత్తలు మస్ట్!

ఇల్లు.. EMI వడ్డీలు - సొంత ఇంటికి బారెడు ఖర్చు - మధ్యతరగతిలో తగ్గిన కొనుగోలు శక్తి

ABOUT THE AUTHOR

...view details