Dokka Seethamma Mid Day Meal Scheme :ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యులు అనప్పిండి భవానీశంకరం, నరసమ్మ దంపతులకు 1841 అక్టోబరులో సీతమ్మ జన్మించారు. పి. గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేదసభలకు వెళ్తూ మండపేటలో భవానీశంకరం ఇంటి వద్ద ఆగారు. ఈ క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి, 1850లో ఆమెను వివాహం చేసుకున్నారు.
Dokka Seethamma Biography : ఆ తర్వాత కాలంలోనూ కుటుంబ వారసత్వాన్ని సీతమ్మను కొనసాగించారు. ఎంతమంది వచ్చినా మాతృవాత్సల్యంతో ఆమె భోజనం పెట్టేవారు. పిఠాపురం మహారాజు, మంత్రి బాటసారుల్లా మారువేషంలో వచ్చి తిన్నారని చెబుతుంటారు. ఒకసారి డొక్కా దంపతులు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఓ పెళ్లి బృందం కనిపించింది. సీతమ్మ ఇంటికి భోజనానికి వెళ్దామని మాట్లాడుకోవడం విన్న ఈ దంపతులు, దైవ దర్శనానికి వెళ్లకుండా ఇంటికొచ్చేశారు. వారికి భోజనం పెట్టి పంపారు.
సీతమ్మ చిత్రపటం చెంత - బ్రిటిష్ రాణి వేడుక : డొక్కా సీతమ్మ సేవలను గుర్తించిన అప్పటి రాజులు, బ్రిటిష్ చక్రవర్తులు ఆమెను సన్మానించాలని ఆహ్వానించారు. అయితే వాటిని సున్నితంగా తిరస్కరించేవారని గోదావరి జిల్లాల్లో చెప్పుకొంటారు. కింగ్ ఎడ్వర్డ్- 7 పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని అతిథులతోపాటు డొక్కా సీతమ్మనూ రాణి ఆహ్వానించారు. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో సీతమ్మ చిత్రపటాన్ని తెప్పించుకుని, పట్టాభిషేక వేడుక చేసుకున్నారని చెబుతారు. 1903 జనవరి 1న అప్పటి మద్రాస్ ప్రభుత్వం ప్రశంసాపత్రాన్ని ఇచ్చింది. భారతదేశ ఏడో బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద మద్రాస్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరి జి.స్టోక్స్ ఈ ప్రశంసాపత్రాన్ని అందించారు.
మరోవైపు పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరిపై నిర్మించిన అక్విడక్ట్‌కు అప్పటి తెలుగుదేశం సర్కార్ డొక్కా సీతమ్మ అక్విడక్ట్‌గా పేరు పెట్టింది. 2000ల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని ప్రారంభించారు. ఆమె చరిత్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ చేరింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై ఆమె వంశీకులు స్పందించారు.