Tidco Benificiaries Issues Tadepalligudem:గత పాలకుల నిర్లక్ష్యం టిడ్కో గృహ సముదాయాల పాలిట శాపంలా మారింది. టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ఆ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వడంలో చూపించకపోవం పేదల పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతోంది. కనీసం నిర్వహణను సైతం గాలికి వదిలేయడంతో రూ.వేలకోట్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోగా వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటే అదనంగా రూ. కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.
శిథిలావస్థలో టిడ్కో ఇళ్లు: పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అద్భుతమైన షీర్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగుదేశం ప్రభుత్వం వేల కోట్లను వెచ్చించి తాడేపల్లిగూడెంలో గృహ సముదాయాలను నిర్మించింది. అయితే 2019 ఎన్నికల అనంతరం అధికారాన్ని చేపట్టిన వైఎస్సార్సీపీ దీన్ని పూర్తిగా అటకెక్కించింది. అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేయకుండా వాటిని పూర్తిగా మరుగున పెట్టేసింది. ఫలితంగా గృహాలన్నీ బీటలు వారాయి. విష జీవులకు ఆవాసాలుగా మారి ప్రజలు నివసించాలంటే ఎంతో భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
దాదాపు 80 శాతం పనులు పూర్తి:2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహ సముదాయాలను దాదాపు 80శాతం పనులు పూర్తి చేసింది అయితే తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేక తమకు కలిగే ప్రయోజనమేంటనో మొత్తానికి వీటిని నిర్వహణను గాలికి వదిలేసిందని మాత్రం అర్ధం అవుతుంది.
కేవలం కొద్దిపాటి పనులు చేసి, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పించి లబ్దిదారులకు అందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అయితే ఆ దిశగా ఆలోచించని వైఎస్సార్సీపీ వీటిని నిర్ధాక్షిణ్యంగా వదిలేసింది. దాంతో రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన గృహసముదాయాలు నిర్వహణ లేక వైఎస్సార్సీపీ నిర్లక్ష్యానికి గురై బూత్ బంగళాలను తలపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారులో టీడీపీ హయాంలో 5376 ఇళ్లు నిర్మించగామాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తన పుట్టినరోజు సందర్భంగా 3232 మంది లబ్దిదారులకు తాళాలు ఇచ్చారు. గృహ సముదాయాల్లో మిగిలిన పనులు పూర్తి చేయకుండా, తమకు కేటాయించిన ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పకుండానే తాళాలు ఇవ్వడంతో లబ్దిదారులు ఎవరూ ఇక్కడకు రాలేదు.