Devineni and MLC Bhumireddy Organized Public Grievance : గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు. అలాగే తెలుగుదేశం హయాంలో ఎస్సీలకు ఇచ్చిన ఇన్నోవా వాహనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీజ్ చేయించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాలు మళ్లీ వెనక్కి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరారు. వారి సమస్యలు తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా స్థాయి అధికారులతో నేతలు ఫొన్లో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చే వాళ్లంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతల బాధితులేనని నేతలు వెల్లడించారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా : ప్రజలు, పార్టీ శ్రేణుల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ"కు శ్రీకారం చుట్టారు. ఇక్కడి కార్యాలయంలో మంత్రితో పాటు రోజుకో ముఖ్యమైన నేత అందుబాటులో ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదివారాలు మినహా రోజుకు ఇద్దరు చొప్పున పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు ఉంటూ వినతులు తీసుకుంటున్నారు.