Deputy CM Pawan Kalyan Varahi Sabha in Pithapuram:పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ వారాహి సభ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారని కొనియాడారు. అందుకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతీ మనిషికి అండగా నిలవాలనుకున్నానని కాని మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారని అన్నారు. 100 శాతం స్ట్రయిక్ రేటు దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చూడలేదని అన్నారు.
లంచాలు అవసరం లేదు:గేటు తాకడం కాదు దాన్ని బద్దలుగొట్టుకుని పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాక నీయమని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారని అన్నారు. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారని, కానీ బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు వెల్లడించారు. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదని నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. బాధ్యతగా ఉండాలనే తమ శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు తెలిపారు.
లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ - ఆయన సూచనకు సంపూర్ణ ఆమోదం - White Paper on Amaravati
పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నా:లంచాలు తీసుకోకుండా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని పవన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నానని అన్నారు. గతంలో వైఎస్సార్సీపీ నాయకులు పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఉండడు, హైదరాబాద్‌లో ఉంటాడని ప్రచారం చేశారు. అందుకే పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నానని, ఈ రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు ఉపాధి అవకాశాలు వంటి హామీలన్నీ గుర్తున్నాయని అవన్నీ నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. నా కుమార్తె కనిపించడం లేదని ఓ తల్లి వచ్చి తన బాధ చెప్పుకొందని ఆమె కష్టం తీర్చాలని 9 రోజులు తాపత్రయపడ్డినట్లు తెలిపారు.