Deputy CM Pawan Kalyan Meet CM Chandrababu: కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ప్రమాదం తీసుకొచ్చేలా ఈ స్మగ్లింగ్ సాగిందని వివరించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో భోజన సమయంలో సుమారు రెండు గంటల పాటు పవన్ భేటీ అయ్యారు. కాకినాడ అడ్డాగా విదేశాలకు బియ్యం అక్రమ రవాణా అంశంపై ప్రధానంగా చర్చించారు.
కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని అరబిందో కోసం బెదిరించి 41.12 శాతం వాటా రాయించుకున్న అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే 48 వేల 537 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం ఎగుమతి కావడం బియ్యం మాఫియా విపరీతధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేషన్ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అధికారుల తీరు సరిగా లేదు: గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, తన పర్యటన సమయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఇప్పటికీ కొందరు అధికారుల తీరు సరిగా లేదని పేర్కొనట్లు సమాచారం. ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి కోట్లు కూడబెడుతున్నారని, రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులోనే గత ప్రభుత్వ హయాంలో బియ్యం ఎగుమతి జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తీసుకురావాల్సి ఉందని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం.
బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్
రాజ్యసభ స్థానాలపై అభిప్రాయం వెల్లడి:ఖాళీ ఏర్పడిన మూడు రాజ్యసభ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపైనా పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అభ్యర్ధుల విషయంలో పలు పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఎవరిని నిలబెడుతోందనేది ఇంకా అధికారికంగా కూటమి నేతలు ఎవరూ ప్రకటించలేదు. మూడు స్థానాల నుంచి ఒక్కో పార్టీ తరఫున ఒక్కొక్కరు పోటీలో ఉంటారా? రెండు చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ అభ్యర్ధి నిలుస్తారా? అనేది ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.