Bicycle Mechanic Social Services in Hindupur :సేవకు సంపద కాదు మంచి మనసుంటే చాలని నిరూపిస్తున్నారు హిందూపురానికి చెందిన రవిశంకర్. అన్నార్తుల ఆకలిదప్పులు తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయాన్నీ ఇతరుల కోసం వెచ్చిస్తున్న రవిశంకర్‌పై కథనం.
రవిశంకర్ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన వ్యక్తి. ఓ చిన్నపాటి సైకిల్ రిపేర్ దుకాణం నిర్వాహకుడు. ఆదాయం, సంపదపరంగా చిన్నవాడైనా సేవలో ఆయనది పెద్ద మనసు. వివిధ పనులపై హిందూపురానికి వచ్చే పేదలు గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బందులు పడటం చూసి చలించిన రవిశంకర్ 11 ఏళ్ల క్రితం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. స్నేహితులతో కలిసి యోగి నారాయణ సేవా సమితి ఏర్పాటు చేసి సేవలను మరింత విస్తృతం చేశారు.
అభాగ్యులకు 'అమ్మానాన్న' - 'సారా' మనసు ఎంత పెద్దదో
పేదల ఆకలి తీరుస్తున్న రవిశంకర్ :6 నెలల క్రితమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. సంపాదనలో సింహభాగం సేవలకే వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, కరోనా వేళ పారిశుద్ధ్య పనులు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి పెద్ద మనసు చాటుకున్నారు. కుటుంబసభ్యులు కూడా ఆయనకు తోడుగా నిలుస్తున్నారు. పట్టణంలోని పేదలు, వేర్వేరు పనులపై గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రవిశంకర్ నిర్వహిస్తున్న నిత్యాన్నదానంతో ఆకలి తీర్చుకుంటున్నారు. రవిశంకర్ సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.