23 Crore Fraud in Nandyal District :లక్షకు పదివేల రూపాయలు వడ్డీ వస్తుందంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అది కూడా స్థానికంగా నమ్మకంగా ఉంటున్న వ్యక్తే ఆ బిజినెస్ ప్రారంభిస్తే ఎంతో మంది క్యూ కట్టారు. కొన్ని నెలల పాటు వడ్డీ తీసుకున్నారు కూడా. కానీ, చివరికి ఏమైందంటే?
అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలకు 23 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తిని నంద్యాల జిల్లా డోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన రామాంజనేయులు డోన్‌లోని కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. 2021 నవంబర్ నుంచి పట్టణంలోని ఓ ఆయుర్వేదిక్ దుకాణంలో పని చేస్తూ అక్కడే ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. లక్షకు 10 వేలు వడ్డీగా చెల్లిస్తానని చెప్పి చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పి అందరినీ నమ్మించాడు. సెప్టెంబర్ నుంచి వడ్డీలు ఇవ్వడం నిలిపివేయగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు రామాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు.
'అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు డోన్ పట్టణంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. ఇతను 2021 నవంబర్ నుంచి పట్టణంలోని నివసిస్తున్నాడు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు పదివేలు వడ్డీ ఇస్తామని, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ద్వారా లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. డోన్, ఇతర ప్రాంతాలకు చెందిన 315 మందితో మొత్తం 23కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్ల రూపంలో సేకరించాడు. ఈ నగదునే విడతల వారీగా వడ్డీ రూపంలో తిరిగి వారికే సుమారు 17కోట్లు చెల్లించాడు. రామాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.' - డీఎస్పీ శ్రీనివాసులు