Changes in CM Chandrababu Security : ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG)లో ఇటీవల పలు మార్పులు జరిగాయి. సీఎం భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి. సీఎంకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఎస్‌ఎస్‌జీ సిబ్బంది, బ్లాక్ క్యాట్ కమాండోలకు అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలూ ఇప్పుడు రక్షణలో ఉంటాయి. ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీపడకుండా, భద్రత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కౌంటర్ యాక్షన్ బృందంలోని ఆరుగురు కమాండోలు విధుల్లో ఉంటారు.
మూడంచెల భద్రత : సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడంచెల భద్రత ఉంటుంది. తొలి వలయంలో ఎన్‌ఎస్‌జీ(NSG), రెండో వలయంలో ఎస్‌ఎస్‌జీ(SSG), అలాగే వివిధ చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంగా ఉంటాయి. వీరందరితో పాటు ముఖ్యమంత్రికి కొద్ది దూరంలో నిత్యం వెన్నంటి ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు సైతం ఉంటారు. ఏదైనా ఆపద సమయంలో మొదటి, రెండో వలయంలోని సిబ్బంది సీఎంను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే, అక్కడి కౌంటర్ యాక్షన్ టీమ్ బయటి నుంచి దాడి చేసే వారిని సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి పెడుతుంది.