CM Jagan Careless on YSR Aasara Scheme :రాష్ట్రంలోని పిల్లలందరికీ తనను తాను మామయ్యనని సీఎం జగన్ ప్రకటించుకున్నారు. ‘జగన్ మామ మీ పాలన మాకు ఓ వరం’ అంటూ పాటలు పాడించుకున్నారు. అప్పుడే పుట్టిన పసికందుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ హయాంలో సర్కారు ఆసుపత్రుల్లో బాలింతలకు అందజేసిన బేబీ కిట్లకు అధికారంలోకి రాగానే పేరు మార్చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు జనాల్ని ఏమార్చి కిట్ల పంపిణీకి మంగళం పాడేశారు. ఈ రూపంలో పేద ప్రజల నెత్తిన మరో ఆర్థిక భారం మోపారు. మామయ్యకు పిల్లలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవడానికి ఈ విషయం చాలు.
వైఎస్సార్ కిట్ల పంపిణీకి అంగన్వాడీలు రాకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం: బొత్స
Government Neglects on YSR Baby Kits : గుజరాతీపేట(శ్రీకాకుళం), పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏడాదికి కచ్చితంగా 10 వేలకు పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. టీడీపీ హయాంలో నవజాత శిశువు రక్షణకు ఆయా చోట్ల ప్రసవానంతరం బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందజేసే వారు. 2019లో ప్రభుత్వం మారగానే ఆ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ బేబీ కిట్లుగా పేరు మార్చారు. కొంతకాలం అరకొరగా పంపిణీ చేసి 2020 తరువాత పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చే వారిలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి వారే ఉంటారు. వారంతా తమ బిడ్డల ఆరోగ్యం, సంరక్షణకు ప్రైవేటుగా బేబీ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కిట్‌కు రూ.800 నుంచి రూ.1,500 వరకు వ్యయం చేస్తున్నారు. ఫలితంగా పేద కుటుంబాలపై ఆర్థికంగా మరో భారం పడింది. దీంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుతోంది.
తప్పని వ్యయం: ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నెలకు 15 నుంచి 20 ప్రసవాలు జరుగుతున్నాయి. సిజేరియన్ చేయడానికి మత్తు వైద్య నిపుణులు అందుబాటులో ఉండటం లేదు. ప్రసవం చేయించుకోవడానికి గర్భిణులు ముందుకు రావట్లేదు. ఇక్కడ కూడా కిట్ బయట కొంటున్నామని, ఇందుకోసం రూ.1,000 నుంచి రూ.1,300 వరకు వ్యయం చేస్తున్నట్లు బాలింతల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.