CM Chandrababu Will Visit the Polavaram Project:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్నీ పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
పోలవరం పనులు పరుగులు పెట్టించాలనే సంకల్పన: చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారాన్ని పోలవారంగా నిర్దేశించుకుని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్నీ చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. అవసరమైతే దిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోను, అధికారులతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి అడుగులు వేశారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం సవాళ్లను పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు.