Cabinet Meeting Chaired by CM Chandrababu:నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నాణ్యమైన అన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం (340 దుకాణాలు) కేటాయించాలనే కమిటీ సిఫార్సుకు సమ్మతి తెలిపింది. రాష్ట్రంలో 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తిరుపతిలో ప్రీమియర్ దుకాణానికి అనుమతివ్వలేదు. అక్టోబర్ మొదటి వారంలో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇది రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి విలేకర్లకు వెల్లడించారు.
‘కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించాం. లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తాం. రిజర్వుడు దుకాణాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేస్తాం. అన్ రిజర్వుడు దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్ ఫీజుల్లో 50 శాతమే రిజర్వుడు దుకాణాలకు ఉంటుంది. లైసెన్స్ ఫీజు నాలుగు శ్లాబులో రూ.50 నుంచి 85 లక్షల వరకు ఉంటుంది. ప్రాఫిట్ 20% మార్జిన్. ప్రీమియం దుకాణాలకు లైసెన్స్ కాలపరిమితి ఐదేళ్లు. ఫీజు రూ.కోటి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి చర్చకు రాలేదు. ప్రైవేటు వారు వారిని తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు’ అని వివరించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది.
రూ.204 కోట్ల లబ్ధి ఎవరికి? : పత్రిక కొనుగోలుకుగాను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ప్రతి నెలా ఇచ్చారు. దీనికోసం వైకాపా ప్రభుత్వంలో ప్రత్యేకంగా రెండు జీఓలు జారీ చేశారు. పత్రిక కొనుగోలుకు ఏడాదికి రూ.102 కోట్ల చొప్పున రెండేళ్లపాటు రూ.204 కోట్లు ఖర్చు చేశారు. నెల నెలా ఇచ్చే రూ.200తో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కేవలం ఒకే పత్రిక కొనుగోలు చేశారనే సమాచారం ఉంది. ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇచ్చారు? రూ.204 కోట్ల లబ్ధి ఏ పత్రికకు లేదా మీడియా సంస్థకు చేరింది? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పత్రిక కొనుగోలుకుగాను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు రూ.200 అందించే జీఓలను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.