CM Chandrababu Speech in National Education Day Program:పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులదని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎ.కన్వెన్షన్‌లో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ హాజరయ్యారు. తల్లిదండ్రులు తరువాత గురువు ఎప్పటికి గుర్తు ఉంటారన్నారు. తనకు విద్య నేర్పిన గురువు ఇప్పటికీ గుర్తేనని సీఎం గుర్తుచేసుకున్నారు. మౌలానా అబుల్ కలాం ముందు చూపు వల్లే నేటి యువత ఐఐటీలో రాణిస్తున్నారని, 1953లో యూజీసీ తీసుకువచ్చి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చారని అన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారని సీఎం అన్నారు. ఒక మంచి టీచర్ ఎప్పటికి మంచి టీచరేనని, అది మన ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు. తాను సీఎంగా అప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని భావించానని, ప్రపంచం మొత్తం తిరిగి ఐటీ కంపెనీలు తెచ్చానని అన్నారు. ఇంగ్లీషు ఉంటేనే భవిష్యత్తు అనే కొత్త థియరీ ఇప్పుడు తెచ్చారని కానీ మన మాతృ భాషకే ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలన్నారు. అప్పుడే అన్ని విధాలా రాణించే అవకాశం ఉంటుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతున్నారు:టెక్నాలజీ వల్ల కొత్త టెన్షన్లు వస్తున్నాయని, కనీసం కుటుంబ సభ్యులతో కూడా గడపలేక గొడవలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. యూపీ, బీహార్‌తో పోలిస్తే మన దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఐటీ రంగంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయితే పిల్లలను కనడంపై దృష్టి పెట్టడం లేదన్నారు. మన జనాభాను పెంచుకోవడం ద్వారా 2047లో మన వాళ్లే అన్నిచోట్లా రాణించే వీలు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు ఇటువంటి అంశాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు.
ఏపీలో టాటాపవర్ రూ.40 వేల కోట్ల పెట్టుబడి - టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం భేటీ