Chandrababu on NITI Aayog : వికసిత భారత్-2047 లక్ష్యసాధనకు అవసరమైన రోడ్ మ్యాప్ తయారీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరఫున తన వాణి వినిపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని చెప్పారు. ఇప్పుడు ప్రజలనూ భాగస్వాములను చేయాలంటూ సీఎం చంద్రబాబు పీ-4 విధానాన్ని నీతి ఆయోగ్ పాలక మండలి ఎదుట ఉంచారు.
ఏపీలో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తాం :ఈ విధానంతో పేదరిక నిర్మాలన సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. దేశంలో తొలి పది శాతం మంది సంపన్నులు అట్టడుగున ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకొని వారి బాగుకు బాటలు వేసేలా విధాన రూపకల్పన చేయాలన్నారు. తద్వారా పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు. ఏపీలో తాము ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ప్రధాని మోదీ గత పదేళ్లలో ఆర్థిక, రాజకీయ సుస్థిరత తీసుకొచ్చి, అన్ని రంగాల్లో మన దేశం ప్రపంచస్థాయి దేశాలతో పోటీపడే శక్తినిచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు బలమైన బ్రాండింగ్ కల్పించారని కొనియాడారు. పదేళ్ల ప్రధాని కష్టాన్ని దేశానికి అనుకూలంగా మార్చుకొనే సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాలు తమవంతు పాత్ర పోషించి, సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తితో ఉంది : వికసిత భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తితో ఉందని చంద్రబాబు చెప్పారు. పీ-4, నదుల అనుసంధానం, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారుల అనుసంధానం, నైపుణ్య గణన, ప్రపంచంలోనే అత్యుత్తమ ఉత్పత్తులు తయారీ గురించి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు.
నదుల అనుసంధానం చేయాలి :రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. పట్టిసీమ ద్వారా జరిగిన నదుల అనుసంధాన ఫలితాన్ని ఏపీ రైతులు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మిషన్‌మోడ్‌లో స్వర్ణచతుర్భుజి ద్వారా దేశవ్యాప్తంగా రహదారుల అనుసంధానం చేసినట్లుగానే ఇప్పుడు నదుల అనుసంధానానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఇందుకోసం జాతీయస్థాయి రోడ్ మ్యాప్ రూపొందించాలని చెప్పారు. జలాలపరంగా భవిష్యత్లో ఎదుర్కొనే సమస్యలనూ పరిష్కరించవచ్చన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లకు రహదారుల్ని అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచనలు చేశారు.