Chandrababu Plan to New Program :ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే ప్రధానమంత్రి మన్ కీ బాత్ గుర్తొస్తోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం. ఈ తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి నుంచి మీతో మీ చంద్రబాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టేదిశగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు బుధవారం శాససనభ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో/ వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది.