Chandrababu Inspected Vijayawada Flood Areas :బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నీటమునిగింది. సింగ్‌నగర్‌లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సింగ్‌నగర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మరోసారి అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. చిమ్మచీకట్లో అరగంటకుపైగా బోటులో పర్యటించారు. సెల్‌ఫోన్లు, వీడియో కెమెరా లైట్ల వెలుతురులో ఆ ప్రాంతంలో తిరిగారు. బాధితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం : వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తలెత్తే ఇబ్బందులను వారికి చంద్రబాబు వివరించారు. కొద్ది గంటల్లోనే వ్యవస్థను చక్కదిద్దితానని హామీ ఇచ్చారు. విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదన్నారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు. సమయం కొంచెం ముందు వెనుక అయినా వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తాను ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు. సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ పనిచేస్తామని చంద్రబాబు భరోసా కల్పించారు.
"చాలా మంది బాధల్లో ఉన్నారు. వరద తగ్గిందని అంటున్నారు. బాధితులకు ఆహారం అందిస్తున్నాం. నేనే స్వయంగా కొందరికి ఆహారం, నీరు అందించా. వారిలో ధైర్యం వచ్చింది. అధికారులతో సమన్వయం చేసుకొని బొట్ల సహాయంతో ఆహార పదార్థాలు పంపిణీ చేస్తాం. కొందరు ఇళ్లలో ఉండిపోతే, మరికొందరు బయటినుంచి ఇళ్లకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. హుద్‌హుద్ విలయానికి, నేటి విపత్తుకు వేర్వేరు పరిస్థితులు. ఇక్కడ నీరు సమస్యగా ఉంది. బోట్లలో వెళ్లి కొన్ని ఇళ్లే చూడగలుగుతున్నాం. అందరినీ బయటకు తీసుకొస్తాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి