CM Chandrababu Interesting Comments in Kolanukonda :మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంచిచేసే వారందరికీ ఏపీకి చిరునామాగా ఉంటుందని చెప్పారు. వారంతా ఆంధ్రప్రదేశ్‌లో ఇక ముందుకు రావాలని తెలిపారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతిత్వరలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని వివరించారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంతకుముందు హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. దైవసేవతో పాటు మానవ సేవను సమానంగా హరేకృష్ణ సంస్థ చేస్తోందని చంద్రబాబు అన్నారు.
CBN Visit Hare Krishna Gokula Kshetram : ఆధ్యాత్మిక ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా మధుపండిత్ దాస్ కృషి చేస్తున్నారని కొనియాడారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవనూ కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
"వెంకటేశ్వరస్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డా. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్షపెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలి. అక్షయపాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయపాత్ర నిర్వహించింది. పెనుగొండలో 108 అడుగుల లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం ఏర్పాటుకు కూడా హరేకృష్ణ సంస్థ ముందుకొచ్చింది." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైంది :అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభసంకేతమని, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామని వ్యాఖ్యానించారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి, చంద్రబాబు సారథ్యంలో గోకుల క్షేత్రం నిర్మాణానికి మార్గం సుగమమైందని ఎన్వీ రమణ వెల్లడించారు.