Chandrababu Meets People in TDP Office : సీఎం చంద్రబాబు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ప్రజలకు దగ్గరగా గడిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కి తరలివచ్చారు. సీఎం రాకతో పార్టీ కార్యాలయంలో జై టీడీపీ, జై చంద్రబాబు నినాదాలు మార్మోగాయి.
సుమారు 2000ల మందిని చంద్రబాబు పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతోపాటు వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు.పలువురు దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి దగ్గరికి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు. వారి ఇబ్బందుల్ని తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తలసేమియాతో బాధపడుతున్న తన ఐదేళ్ల కుమార్తె వైద్యానికి రూ.25 లక్షలు ఖర్చవుతాయని ఉయ్యూరుకు చెందిన శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ కింద పది లక్షలు మంజూరయ్యాయని, మిగిలిన మొత్తాన్ని కూడా అందజేయాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు.