CM Chandrababu Nominated Posts: నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని స్పష్టంచేశారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. 30 వేల దరఖాస్తులు పరిశీలించి, తగిన వ్యక్తికి తగిన గౌరవం విధానంతో అవకాశం కల్పించామన్నారు. వేధింపులకు గురైన వారికి, మహిళలు, యువతకు అవకాశాలు, సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయని తెలిపారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎంపికైన వారు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు.
30 వేల దరఖాస్తులను స్వయంగా పరిశీలించి: నామినేటెడ్ పదవుల మొదటి లిస్టులో 20 ఛైర్మన్ పోస్టులు, ఒక వైస్ ఛైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. రెండో లిస్టులో ఏకంగా 62 మందికి ఛైర్మన్ పదవులు, సలహాదారు పదవులు కట్టబెట్టింది. సుదీర్ఘ కసరత్తు తరువాత పదవుల కోసం వచ్చిన 30 వేల దరఖాస్తులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి నేతలను వివిధ పోస్టులకు ఎంపిక చేశారు. వీటిలో 60 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కాగా, క్యాబినెట్ హోదాతో రెండు సలహాదారు పోస్టులు ఉన్నాయి.
పదవులు పొందిన అందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కూటమి ప్రభుత్వంలో మంచి అవకాశాలు పొందారన్న చంద్రబాబు, పొలిటికల్ గవర్నెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పదవులకు ఎంపిక చేశామని స్పష్టంచేశారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలకు చేసే మంచిలో భాగస్వాములు కావడమేనని తేల్చిచెప్పారు. మరింత ఖచ్చితత్వంతో, క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.
'చాగంటి'కి కీలక పదవి - ఏపీలో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదల
కష్టపడిన వారికి న్యాయం చేయాలనే : పదవుల ఎంపికపై సుదీర్ఘమైన, పటిష్టమైన కసరత్తు చేశామని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. ఎంతో మంది ఆశావాహులు ఉన్నా కష్టపడిన వారికి న్యాయం చేయాలనే అంశం ప్రాతిపదికగా ముందుగా మిమ్మల్ని ఎంపిక చేశామన్నారు. పార్టీ కోసం పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సరైన వ్యక్తికి సరైన చోట టిక్కెట్ అనే విషయంలో అనుసరించిన విధానం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్న చంద్రబాబు, స్వయంగా ప్రజల నుంచి ఎమ్మెల్యేగా ఎవరిని కోరకుంటున్నారని ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుని ప్రజామోదం ఉన్నవారికే టిక్కెట్లు ఇచ్చిన్నట్లు గుర్తుచేశారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు: ప్రజలు ఆ విధానాన్ని స్వాగతించడం వలనే చరిత్రలో లేని విధంగా 93 శాతం స్ట్రైక్ రేట్‌తో, 57 శాతం ఓట్ షేర్‌తో కూటమికి పట్టంకట్టారని తేల్చిచెప్పారు. నేడు పదవుల విషయంలో కూడా అదే సూత్రాన్ని అవలంభించిన్నట్లు తెలిపారు. ముఖ్యంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వ దాష్టీకాలను ఎదుర్కొని 5 ఏళ్లు ధైర్యంగా నిలబడిన వారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. కేసులు, దాడులు, వేధింపులకు గురైన వారిని గుర్తుపెట్టుకుని గౌరవించిన్నట్లు వెల్లడించారు.