CM Conducted Review of Women and Child Welfare Department :మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమపథకాలు ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం చర్చించారు.
ఒకటో తేదీనే పింఛన్లు, వేతనాలు ఇవ్వడం సంతృప్తినిచ్చింది: చంద్రబాబు - CM Chandrababu emotional
ఆ పథకాల స్థితిగతులను తెలుసుకున్న సీఎం : గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై చంద్రబాబు సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48,770 ఉండగా, మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.
14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు : 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తి అయ్యాయని, మరో 2800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే గత ఐదు ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని అధికారులు వివరించారు. అంగన్వాడీల అప్ గ్రెడేషన్లో కూడా పురోగతి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, అలాగే 8,455 సెంటర్లలో విద్యుత్తు సదుపాయం లేదని సీఎంకు అధికారులు సమీక్షలో వివరించారు.
సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు :కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
'రాళ్ల సీమను రత్నాల సీమగా చేసే బాధ్యత మాది': మడకశిరలో సీఎం చంద్రబాబు - CHANDRABABU COMMENTS AT MADAKASIRA
'ఆర్థికంగా, సామాజికంగా ఎస్సీల జీవితాల్లో వెలుగులు రావాలి'- సుప్రీం తీర్పుపై సీఎం, మంత్రుల స్పందన - AP CM On SC ST Classification