Two Groups Clash in Kakinada :ఇంటి స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ముగ్గురి హత్యకు దారితీసింది. కాకినాడ జిల్లాలో కత్తులు, ఇనుపరాడ్లతో ఓ కుటుంబం మరో కుటుంబంపై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఆదివారం రాత్రి జరిగింది.
దళిత కాలనీ చెరువులో కాల్దారి పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. శ్లాబు వేసే హడావుడిలో కుటుంబసభ్యులంతా ఉన్నారు. ఈలోగా 26 మంది ఇనుప పిడులున్న కత్తులు, రాడ్లతో వారిపై దాడికి దిగారు. మహిళలు కారం డబ్బాలతో దాడి చేశారు. హాహాకారాలతో కాల్దారి పండు కుటుంబసభ్యులు పరుగులు తీశారు. అయినా కత్తులతో వెంబడించి దాడి చేయడంతో రక్తం చిందింది. కాల్దారి పండు దళిత కాలనీలోని చెరువు స్థలం ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని బచ్చల కుటుంబానికి చెందిన వారు వ్యతిరేకించారు. గత మూడు నెలలుగా ఈ వివాదం నడుస్తోంది. గ్రామంలోని పంచాయతికి ఫిర్యాదు చేశారు. అయినా వివాదం సద్దుమణగలేదు.
ఈలోగా కాల్దారి పండు ఆదివారం రాత్రి ఇంటి శ్లాబు నిర్మాణం చేస్తుండగా ఒక్కసారిగా 26 మంది వచ్చి ఇనుప రాడ్లు, కత్తులతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో అక్కడిక్కడే కాల్దారి ప్రకాశరావు మృతి చెందారు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సామర్లకోట, కాకినాడ తరలించారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాల్దారి చంద్రరావు మరణించగా కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా ఏసుబాబు ప్రాణాలు వదిలాడు. తీవ్ర గాయాలతో కాల్దారి పండు, దావీదు బాబీ, చిన్నోడు, సంజీవరావు, అచ్చెయ్య, సత్యవేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన ప్రత్యర్థి వర్గంలోని బచ్చల సుబ్బారావుకు ఘర్షణలో గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
Vetlapalem Attack Case : ఘటనా స్థలంలో కత్తులు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు సామర్లకోట పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులను హతమార్చిన తపాలా ఉద్యోగి - బాపట్ల జిల్లాలో దారుణం