Clap Auto Drivers Problems in AP : వాళ్లంతా క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహన రథసారథులు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్త సేకరణ వాహనాలు ప్రతిరోజూ మన వీధిలోకి, ఇంటి వద్దకు రావాల్సిందే ఏ ఒక్కరోజు చెత్త సేకరణ వాహనాలు రాకపోయినా, మన ఇంటితో పాటు చుట్టు పక్కలో పరిసరాలు దుర్గంధం భరితంగా మారుతాయి. ప్రస్తుతంక్లాప్ డ్రైవర్లు కొన్ని నెలలుగా సరైన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎనిమిది నెలలుగా జీతాలు బంద్, పండుగనాడూ పస్తులే - వాహనాలను నిలిపేసి ఆందోళనకు దిగిన 'క్లాప్' డ్రైవర్లు
శ్రమకు తగిన జీతాలు లేవు : వీధుల్లోని చెత్తను సేకరించి తరలించటానికి వైఎస్సార్సీపీ సర్కార్ క్లీన్ ఆంధ్రప్రదేశ్- క్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీటి కోసం ప్రత్యేక వాహనాలను పంపిణీ చేసింది. నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వారు డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్నారే తప్ప శ్రమకు తగిన జీతాలు ఇవ్వట్లేదు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి. 91 వాహనాలకు గాను 91 మంది డ్రైవర్లను నియమించారు. వారికి కేటాయించిన వార్డుల్లో మూడు లోడ్ల చెత్తను గార్గేయపురంలోని డంపింగ్ యార్డుకు తరలించాలి. ఇలా రోజూ సుమారు 200 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్నారు. ఎండనక, వాననక చెత్తను తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న క్లాప్ డ్రైవర్ల జీవితాల్లో మాత్రం వెలుగుల్లేవు.