CJI DY Chandrachud Visited Tirumala Temple: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి మహాద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.
CJI DY Chandrachud Visit Tirupati SV University:తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తిరుపతి ఎస్వీ వర్సిటీని పరిశీలించారు. వర్సిటీ నిర్వహణలో టీటీడీ పాత్ర, వేదాధ్యయన విభాగాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఈ క్రమంలో తాళపత్ర గ్రంథాల డిజిటలైజ్ తీరును సీజేఐ అడిగి తెలుసుకున్నారు. వేదాధ్యయనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. వేద వ్యాప్తికి టీటీడీ కృషి అభినందనీయమని కొనియాడిన సీజేఐ తిరుమల శ్రీవారి దర్శనానంతరం మానసిక ప్రశాంతత లభించిందని తెలిపారు.