Chittoor Road Construction Works : త్వరలోనే చిత్తూరు జిల్లా కేంద్రం చుట్టూ మణిహారాల్లాంటి మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. 4, 6, 8 వరసలుగా చేపట్టిన వీటి పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో జిల్లా కేంద్ర ముఖచిత్రమే మారిపోయేలా ఉంది. బెంగళూరు-చెన్నై రహదారి చిత్తూరు కేంద్రంగా గతంలోనే నిర్మాణం చేపట్టారు. అది పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాల్సి ఉంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి సరకును నేరుగా పోర్టుకు తీసుకెళ్లేందుకు చిత్తూరు శివారు నుంచి చిత్తూరు-తచ్చూరు మధ్య ఆరు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. ఇదీ కొద్ది నెలల్లో వినియోగంలోకి రానుంది. ఈ మార్గంలోనే కర్ణాటక, తమిళనాడు, ఏపీలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న మరో రోడ్డు చిత్తూరు జిల్లాలో 80 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. దీనికి చిత్తూరు శివారు చీలాపల్లి, బైరెడ్డిపల్లె వద్ద మాత్రమే ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఇచ్చారు.