Chinna Jeyar Swamy Comments on CM Chandrababu:వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు యువకుడి కంటే బాగా పని చేస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి ప్రశంసించారు. రోజుకి నాలుగైదు సార్లు బాధితుల వద్దకు వెళ్లి నేనున్నానని ధైర్యం చెప్పడం చాలా సంతోషంగా ఉందని ప్రశంసించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద చిన్న జీయర్ స్వామి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ తల్లికి సారె సమర్పించారు. గడిచిన 40 ఏళ్లలో ఇలాంటి విపత్తు రాలేదని చిన్న జీయర్ స్వామి చెప్పారు. మహానాడు వైపు కూడా గట్టు నిర్మిస్తే వరదల నుంచి ప్రజలను రక్షించే అవకాశం ఉందని తెలిపారు.
విశాఖలోని హుద్ హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు పని చేసిన విధానం అందరి దృష్టిని ఆకర్షించిందని చిన్న జీయర్ స్వామి అన్నారు. అంతకంటే ఎక్కువగా విజయవాడలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బాధితులకు ధైర్యం చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని కొనియాడారు. చంద్రబాబుకి మరింత శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో భారీగా పేరుకుపోయిన ఇసుక మేటలు తొలగిస్తే ఎక్కువ నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని స్వామి తెలిపారు. ఈ పనులను ప్రభుత్వం వేగంగా చేపడితే ఫలితాలు ఉంటాయన్నారు.