CM Chandrababu Review on Home Department:2014 - 19తో పోల్చితే 2019 - 24 మధ్య రాష్ట్రంలో క్రైమ్ రేటు 46.8 శాతం పెరిగిందని హోంశాఖ అధికారులు సీఎం చంద్రబాబుకి నివేదించారు. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై నేరాలు 152 శాతం, మిస్సింగ్ కేసులు 84 శాతం, సైబర్ క్రైం 134 శాతం ఎక్కువైనట్లు వివరించారు. హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో గంజాయితోపాటు డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేయడం, సైబర్ క్రైమ్‌కు అడ్డుకట్ట వేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడంలో టెక్నాలజీ వినియోగం, పోలీసు శాఖ బలోపేతంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలన్నారు. విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వస్తానని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించండి. రాష్ట్రం నుంచి గంజాయి, డ్రగ్స్ తరిమేయాలని ఆదేశించారు. ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టను మళ్లీ నిలబెడదాం - ప్రజల భద్రతకు భరోసా ఇద్దామన్నారు.
Home Minister Anita comments:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. హోంశాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. వైఎస్సార్సీపీ హయాంలో సీసీ కెమెరాల నిర్వహణ కూడా సరిగాలేదని మండిపడ్డారు. మహిళల భద్రత గురించి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో దాదాపు 15వేల సీసీ కెమెరాలు ఉంటే వాటిలో కొన్ని పని చేయట్లేదని మంత్రి అనిత తెలిపారు.