Cesarean increasing in Hospitals : రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 నుంచి 40, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 60 నుంచి 70 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. నొప్పులు భరించలేక కొందరు ముహుర్తాల కోసం మరికొందరు సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్నారు. వామ్ వాటర్ థెరపీ లాంటి ఆధునిక చికిత్సతో సాధారణ కాన్పులు చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
'ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నొప్పులు తట్టుకోలేక, మంచి ముహూర్తాల కోసం సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దేశంలో మాతృత్వ మరణాల రేటు లక్ష జనాభాకు 97 ఉండగా రాష్ట్రంలో 45గా నమోదైంది. కేరళ వంటి రాష్ట్రాల్లో ఇది 17 శాతం మాత్రమే. మాతృ మరణాల్లో సిజేరియన్ కేసులే ఎక్కువ. సాధారణ కాన్పు వారిలో లక్షకు 95 మంది మృతి చెందుతుండగా సిజేరియన్ కేసుల్లో ఈ సంఖ్య 189కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు సిజేరియన్ కేసులను లాభాపేక్షతో చూస్తున్నారు. సహజ కాన్పు కోసం ఎక్కువ సేపు చూడాలన్న ఉద్దేశంతో ఆసుపత్రుల వారు సిజేరియన్‌కు మొగ్గుచూపుతుండగా తల్లిదండ్రులు సరేనంటున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.' -డా.శ్రీదేవి, అను ఆసుపత్రి, డా. మంజుశ్రీ, గైనకాలజిస్ట్
Cesarean Delivery Risks to Mother And Baby : సిజేరియన్ కేసుల్లో దీర్ఘకాల సమస్యలు ఎదురవుతున్నాయి. బిడ్డకు తల్లి పాలు ఆరంభించటంలోనూ జాప్యం జరిగే అవకాశం ఉంది. నవజాత శిశుమరణాలూ సంభవిస్తున్నాయి. ఒక్కోసారి నెలలు నిండకుండానే గర్భిణులకు సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పిల్లలు మరణించకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజ కాన్పుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.