CM Chandrababu Thanks to PM Modi and Central Minsiters : విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకున్నది ఎన్డీయే ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదంతో తెలుగుజాతి సాధించుకున్న పరిశ్రమ అని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ప్యాకేజీకి ప్రకటించడంతో ప్రధాని మోదీ, నిర్మలా సీతారామాన్, కుమారస్వామిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో పట్టుదలతో కష్టపడి రూ.11,440 కోట్లు సాధించామన్నారు. విశాఖ ఉక్కును బలమైన సంస్థగా ముందుకు తీసుకెళ్లేందుకు కలసికట్టుగా కృషి చేస్తామని వెల్లడించారు.
సమర్ధుడైన సీఈఓను నియామకం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. గడిచిన 7 నెలల్లో అసాధ్యమైన పనులెన్నో సాధించుకుంటూ వస్తున్నామన్నారు. అమరావతి ఏకైక రాజధాని గా తేల్చడంతో నిధులు తెచ్చి పుననిర్మాణం చేపట్టామని చంద్రబాబు తెలిపారు. పోలవరానికి నిధులు సాధించాం, డయాఫ్రమ్ వాల్ కు శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు. విశాఖ రైల్వే జోన్‌కు అవసరమైన భూమిని సమీకరించి జోన్‌ను సాధించామని గుర్తు చేశారు. 7 నెలల్లో 4లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు. మిట్టల్ పరిశ్రమ, విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖ-అనకాపల్లి కలిసి స్టీల్ నగరంగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు.
వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించింది : స్టీల్‌ప్లాంటుకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడం చాలా సంతోషం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉక్కు పరిశ్రమను నిలబెట్టాలన్న ప్రధాని నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. ప్యాకేజీ కేవలం సంఖ్య కాదు వేల కుటుంబాల్లో ఆశలు రేకెత్తించిందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కల సాకార క్రమంలో స్టీల్ ప్లాంటు ఒకటన్నారు. ఏపీ అభివృద్ధి పట్ల మోదీ నిబద్ధతకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు కష్టాన్ని దగ్గరగా చూశా : ఉక్కు రెక్కలతో ఆయుధాలు ధరించి, ఆంధ్రప్రదేశ్ కొత్త శిఖరాలకు ఎదుగుతుందని లక్షలాది జీవితాలను మంచిగా మారుస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరుగుతుందన్నారు. నష్టాల్లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని మూతపడకుండా కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎలా కృషి చేశారో తాను చాలా దగ్గరగా చూశానని లోకేశ్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ - వికసిత్ ఏపీలో భాగంగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూనే లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ప్లాంట్ కు పెద్దపీట వేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మద్దతుగా నిలిచిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, మంత్రి కుమారస్వామికి కృతజ్ఞతలు చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్లు - కేంద్రం అధికారిక ప్రకటన