దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా జగన్ : చంద్రబాబు CBN Fired on CM Jagan: స్కాం కోసమే స్కీం విధానాలతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్‌కు, పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏ మూలన చూసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంసంతో నష్టపోయిన ప్రజలే కనిపిస్తున్నారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో సభలు పెడుతూ జగన్ చెబుతున్న అసత్యాల నిగ్గుతేల్చేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.
బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదని, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఏ అంశం మీదనైనా, ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు తాను సిద్ధమేనన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో చర్చిద్దామన్నారు. 2019లో ప్రజలిచ్చిన ఒక్క అవకాశమే జగన్‌కు చివరి ఛాన్స్ కానుందని జోస్యం చెప్పారు.
సిద్ధం సభతో వైసీపీ విధ్వంసం - సీమ ప్రజల అగచాట్లు ఒకవైపు, మందుబాబుల చిందులు మరోవైపు
ఎమ్మెల్యేల బదిలీ అంటూ మడతపెట్టారు: ఓటమిపై స్పష్టత రావడంతో మళ్లీ ప్రజల్ని ఏమార్చడానికి పరదాలు కాస్తా పక్కకు జరిపి ఎన్నికలకు ముందు సీఎం రోడ్డెక్కారని దుయ్యబట్టారు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేల్ని బదిలీలంటూ మడతపెట్టారని, మిగిలిన వారిని 50 రోజుల్లో ప్రజలు మడతపెడతారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.
బాధిత కుటుంబాలే క్యాంపెయినర్లు: అన్ని వర్గాలనూ మోసం చేసిన వ్యక్తికి సామాజిక న్యాయం అనే పదాన్ని పలికే అర్హతే లేదని ఆక్షేపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైఎస్సార్సీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినర్ కాబోతోందన్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ఆర్టీసీ, పాఠశాల బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారని చంద్రబాబు విమర్శించారు.
సీఎం జగన్ చెడు పనులు చేయడంలో ధైర్యాన్ని చూపుతున్నారు: సీపీఐ నారాయణ
టీడీపీ హయంలోని సంక్షేమ పథకాలు రద్దు : సభ నిజంగా విజయవంతమై ఉంటే జగన్‌రెడ్డి రౌడీ గ్యాంగ్ మీడియా సిబ్బందిపై ఎందుకు దాడులు చేసిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 120 సంక్షేమ పథకాల్ని రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
రాబోయే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్, 5 కోట్ల మంది ఆంధ్రులకు మధ్య జరిగే యుద్ధమని చంద్రబాబు అభివర్ణించారు. టీడీపీ పేరు, తన పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్‌ప్లాన్ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగభృతి, 11 డీఎస్సీలతో ఇచ్చిన లక్షా 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు గుర్తువస్తాయన్నారు.
సీఎం జగన్‌కు నిరసన సెగ - రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు
విధ్వంస పాలనతో విభజన కంటే నష్టం: రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు - కుంకుమ, చంద్రన్నబీమా, పండుగ, పెళ్లి కానుకలు, రాజధాని అమరావతి, 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు, మహిళల కోసం 22 పథకాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. విభజన అనంతరం అనేక అడ్డంకులు, సవాళ్లు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళితే జగన్ విధ్వంస పాలనతో విభజన కంటే ఎక్కువ నష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధే లేదు: తెలుగుదేశం హయాంలో 14 శాతంగా ఉన్న వృద్ధిరేటు, నేడు 10.93 శాతానికి పడిపోయిందని ఆక్షేపించారు. పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏడాదికి 30 వేల కోట్ల రూపాయలు చొప్పున తగ్గిందన్నారు. తెలంగాణతో పోల్చితే తలసరి ఆదాయం 44 శాతం తక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడమే దీనికి కారణమని మండిపడ్డారు.
సీఎం జగన్ పొలిటికల్ షో - రోడ్లపై నరకయాతన! బస్సులు లేక ప్రయాణికులకు - దారి మళ్లింపుతో డ్రైవర్లకు చుక్కలు!
గుర్తోచ్చేవి హింసాత్మక రాజకీయాలే: జగన్‌రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేది బాబాయ్‌పై గొడ్డలి వేటు, కోడికత్తి కేసు, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం, క్విడ్‌ప్రోకో, భూమి, ఇసుక, మద్యం, గనుల మాఫియా అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాదుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసాత్మక రాజకీయాలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు.
సమాధానాలు చెప్పలేకే అక్రమ కేసులు: అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం తప్ప జగన్ సాధించింది శూన్యమన్నారు. ప్రభుత్వ అక్రమాల్ని ప్రశ్నించిన ప్రతిపక్షాల్ని సమాధానం చెప్పలేకే కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు పెట్టారని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు దాడులు చేసినా ప్రశ్నించే గళాలను అణచివేయలేరని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తమ జీవితాల్ని నాశనం చేసిన ఫ్యాన్ రెక్కల్ని విరగొట్టడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
సీఎం సభ కోసం దారి మళ్లింపు- వందల కి.మీ చుట్టూ తిరిగెళ్లాల్సి వస్తోందని లారీ డ్రైవర్ల గగ్గోలు