CBI Case on KLEF University : గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యంపైన, తీసుకున్న సభ్యులపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్-కేఎల్ఈఎఫ్ ప్రెసిడెంట్, ఇతర ప్రతినిధులతోపాటు న్యాక్ తనిఖీ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సీబీఐ పేర్కొంది. 10 మందిని అరెస్ట్ చేసింది.
నగదు, బంగారం రూపంలో లంచాలు :వీరిలో కేఎల్‌యూ యాజమాన్య ప్రతినిధులతోపాటు, దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లూ ఉండటం సంచలనంగా మారింది. దిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు విజయవాడ గవర్నర్‌పేటలోని కేఎల్‌యూ పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్‌లో సోదాలు చేపట్టాయి. శనివారం రాత్రి 10 గంటల తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయి. ఏ++ రేటింగ్ కోసం వర్సిటీ యాజమాన్యం నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల రూపంలో న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సీబీఐకి ఫిర్యాదులు వెళ్లాయి.
కేసు నమోదు చేసిన సీబీఐ ఆఘమేఘాలపై దిల్లీ నుంచి బృందాలను పంపింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధనగర్, న్యూదిల్లీలోని 20 చోట్ల న్యాక్ బృంద సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశాయి. వారి వద్ద నుంచి రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్ 16ప్రో స్వాధీనం చేసుకున్నాయి. సీబీఐ అరెస్ట్ చేసినవారిలో కేఎల్ఈఎఫ్ వైస్ ఛాన్సలర్ జేపీ సారథి వర్మ, వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, కేఎల్‌యూ హైదరాబాద్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ ఉన్నారు. వీరిని విజయవాడ జైలుకు సీబీఐ తరలించింది.