Case Registered on Jagan :మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ పి.వి. సునీల్‌కుమార్‌పై కేసు నమోదయ్యింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju)ను గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాహత్నం చేశారని ఫిర్యాదు చేశారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈనెల 11న ఈ మెయిల్ ద్వారా ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జగన్ అధికారం కోల్పోయాక నమోదైన తొలి కేసు ఇది. ఈ కేసులో ఐదుగురుని నిందితులుగా పేర్కొనగా, జగన్‌ను ఏ3గా చూపించారు.
లాఠీలతో కొట్టారు :2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్‌ను A3గా పోలీసులు పేర్కొన్నారు. A1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం :రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జూన్ 11న ఆయన ఈ విషయంపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అందులో పూర్తి వివరాలు లేకపోవటంతో అదనపు సమాచారం జోడించి జులై 11న మరోసారి ఫిర్యాదును మెయిల్ ద్వారా పంపించారు. జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం చేశారని, ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని కొట్టారని ఆరోపించారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదులో చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. జగన్‌ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు.
తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదు :తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు.
స్పందించిన సునీల్ కుమార్ : తనపై కేసు నమోదుపై సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ "సుప్రీం కోర్టులో మూడేళ్ల నడిచి సాక్ష్యాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను" అని అన్నారు.