Care During Storage of Paddy in Bapatla District :మీకు ధాన్యం పురులు తెలుసా! అదేనండీ వడ్లు నిల్వ చేసేందుకు ఎండు గడ్డితో చేసే నిర్మాణం. ఒకప్పుడు ప్రతి రైతు ఇంటా కనిపించే గుమ్ములు, గాదెల్లాంటివే. ఇప్పుడు కొత్త కొత్త పద్దతులు రావడంతో ఈ పురులు పెద్దగా వాడటం లేదు కానీ బాపట్ల జిల్లా నగరం మండలంలోని మంత్రిపాలెంలో అన్నదాతలు ఇప్పటికీ ఈ పురులను వాడుతున్నారు.
ఈ పురులు ఎలా చేస్తారంటే :ముందుగా వరి గడ్డిని పోగు చేసుకుంటారు. దాన్ని పెద్ద తాడులా పేనుతారు. ఆ తరువాత వృత్తాకారంలో గోడలా చుడతారు. అందులో ధాన్యం పోస్తారు. లోపలికి నీరు వెళ్లకుండా గుడిసె ఆకారంలో పైకప్పును మూసేస్తారు. వీటిలో నెలల పాటు ధాన్యం నిల్వ చేయొచ్చు. ఇలా మాగిన ధాన్యాన్ని కొనేందుకు మిల్లర్లు, బియ్యం వ్యాపారులు ఆసక్తి చూపుతారు.
పురుల్లో నిల్వ చేస్తే లాభం ఏంటంటే :ఈ ధాన్యాన్ని మర పట్టించగా వచ్చిన బియ్యంతో వండిన అన్నానికి రుచి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది త్వరగా పాడవదు అని రైతులు చెబుతున్నారు. తెనాలి, పొన్నూరు, రేపల్లె, బాపట్లలోని రైస్‌మిల్లర్లు వీటినే ఎక్కువ విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. అందుకే 25 కిలోల బియ్యం బస్తాను సాధారణం కంటే రూ.500 ఎక్కువ చెల్లించి మరీ కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.