CAPITAL AMARAVATI ICONIC BUILDINGS : ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలకు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శాసనసభ, హైకోర్టు, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లను మార్చకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్‌తో పాటు, ఐకానిక్ భవనాలకు ఆకృతుల్ని 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ (Norman Foster and Partners) రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతి నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐకానిక్ బిల్డింగ్స్ ఆకృతులపై ఉన్నతస్థాయిలో చర్చ జరిగింది. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం రూపొందించిన ఆ ఆకృతుల్లో ఇప్పుడేమైనా మార్పులు చేయాలా అనే కోణంలో చర్చించారు.
దీంతో బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులూ చేయరాదని, అవసరమైతే అంతర్గతంగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే మళ్లీ వాటిని మారిస్తే మరో ఏడాదిన్నర సమయం వృథా అవుతుందన్న ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా హైకోర్టు, సచివాలయం టవర్లకు సంబంధించిన పునాదులు సైతం ఇప్పటికే పూర్తయినందున, ఇప్పుడు ఆకృతులను మార్చాలనుకోవడం సరికాదన్న అభిప్రాయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది.
పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్ - ఇక పనులు రయ్ రయ్ - NHAI on Amaravati ORR Project
ఆర్కిటెక్ట్ కోసం సీఆర్‌డీఏ టెండర్లు:మరోవైపు ఐకానిక్ బిల్డింగ్స్ డిజైన్లకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఆర్కిటెక్ట్ నియామకం కోసం సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. అయితే లండన్ సంస్థ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు సైతం ప్రీబిడ్ మీటింగుకు హాజరవడం గమనార్హం. ఆ కంపెనీ కూడా బిడ్ దాఖలు చేసి ఉంటుందని సీఆర్‌డీఏ భావిస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఆర్కిటెక్ట్‌ను ఖరారు చేయనున్నారు. హైకోర్టు, సచివాలయ భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై ఐఐటీ నిపుణులు చెప్పడంతో, ఆ భవనాల నిర్మాణానికి సైతం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది.