Bobbili Veena Making Problems :సప్తస్వరాలను సుమధురంగా పలికించే సంగీత సాధనాల్లో బొబ్బిలి వీణలది ప్రత్యేక స్థానం! విజయనగరం జిల్లా బొబ్బిలిలో తయారయ్యే ఈ వీణలు శ్రుతి తప్పకుండా వీనుల విందైన సంగీతం పలికిస్తాయనే గుర్తింపు ఉంది. అందుకే ఇక్కడ వీటి తయారీ 3 శతాబ్దాల క్రితమే మొదలై ఓ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి వడ్రంగులు వారసత్వంగా వీటిని తయారుచేస్తూ వస్తున్నారు.
సంగీతానికే కాదు గిఫ్ట్ వీణలకూ మంచి గిరాకీ ఉంది. నెమలి, హంస నమూనాలుండే వీణల్ని అతిథులు, ప్రముఖులకు జ్ఞాపికలుగా అందిస్తుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా భారత పర్యటనలో బొబ్బిలి వీణను చూసి ముచ్చటపడ్డారు. తయారీదారుల సంఘం అధ్యక్షుడు సర్వసిద్ధి వెంకటరమణను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి గౌరవించారు. ఏడేళ్ల క్రితం దీనికి భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది.
సకాలంలో అందించలేని పరిస్థితి : బొబ్బిలి వీణకు చాలా ప్రత్యేకతలున్నాయి. మైసూరు, తంజావూరు వీణలు 3 చెక్కలతో తయారవుతాయి. కానీ బొబ్బిలి కళాకారులు మాత్రం ఒకే చెక్కతో చెక్కుతారు. దాని కోసం కేవలం పనస కలపనే వాడతారు. దీని వల్ల రాగం మృదువుగా ఉంటుంది. కానీ ఇప్పుడా పనస కలపకు కొరత ఏర్పడింది. ఫలితంగా ఆర్డర్లు సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. స్థానికంగా అందుబాటులో లేక ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటుంటే తయారీ ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వీణల విక్రయాలపై పడుతోంది.