Ball Beverage Company Will Invest 700 Crores In Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మరో సంస్థ ముందుకొచ్చింది. అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. రూ. 700 కోట్లతో యూనిట్‌ను స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
బీర్లు, శీతల పానీయాలు, పర్ ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను బాల్ సంస్థ సరఫరా చేస్తుంది. బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధిపతి గణేశన్‌తో పాటుగా సంస్థ ప్రతినిధులు ఆదివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు. బాల్ సంస్థకు రాష్ట్రంలో అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తి ప్రణాళిక సమర్పించాలని సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు.
కక్షపూరిత ధోరణితో మూతబడిన ఒంగోలు డెయిరీ - తెరిపించాలని కోరుతున్న పాడిరైతులు - Ongole Dairy Pathetic Condition
500 మందికి ఉపాధి అవకాశాలు: తెలంగాణలో బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్‌బాబు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్‌లో టిన్నుల వాడకం 25 శాతం వరకు ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ, తెలంగాణలో మాత్రం ఇది 2 శాతం లోపే ఉందని తెలిపారు. అవి కూడా మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయడానికి ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని శ్రీధర్ బాబ తెలిపారు.
ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు: ఎక్సైజ్ విధానంలో మార్పులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని శ్రీధర్ బాబు తెలిపారు. 500 మి.లీ. పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో కోకాకోలా సంస్థ రూ.1000 కోట్లతో బాట్లింగ్ యూనిట్ ఏర్పాటుకు గతంలో సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ యూనిట్‌కు ‘బాల్’ సంస్థ అల్యూమినియం టిన్నుల సరఫరాకు అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.
రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తల చూపు - తిరిగొస్తున్న ఇండస్ట్రియల్ దిగ్గజాలు - Industries for Andhra Pradesh