Authorities are Responsible For Removing Hoarding and Flexi :నగరాలు, పట్టణాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, కటౌట్లను తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ప్లెక్సీలను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అసౌకర్యం కల్పిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీ నేతలే కాక, ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంది.
ఎక్కడ పడితే అక్కడ ప్లెక్సీలు :విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు, బ్యానర్ల విషయంలో అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సమాచారం అందాక చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ కోరతామంది. ఈ వ్యాజ్యంలో కోర్టుకు సహాయకులుగా వాదనలు వినిపించేందుకు అమికస్‌క్యూరీగా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్‌ను నియమించింది.