ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రం ఉప్పుతో బ్యాటరీ తయారీ! - పురోగతి సాధించిన ARCI - ARCI FOCUS ON SODIUM ION BATTERY

సోడియం అయాన్‌ బ్యాటరీ రూపకల్పనలో ఏఆర్‌సీఐ పురోగతి లిథియం బ్యాటరీలకు ప్రత్యామ్నాయాలపై ఏఆర్‌సీఐ గురి

ARCI Focus on Sodium Ion Battery
ARCI Focus on Sodium Ion Battery (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 8 hours ago

ARCI on Sodium Ion Battery : విద్యుత్‌ ద్విచక్ర వాహనాల వినియోగంలో వేగం పెరిగింది. ప్రస్తుతం వీటిలో లిథియం అయాన్‌ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. ఈ బ్యాటరీ తయారీలో కీలకమైన ముడిసరకు లిథియంను దిగుమతి చేసుకోవాల్సి రావడంతో తయారీ ఖర్చు పెరగడంతోపాటు ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ లోహాలపై హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూమెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) పరిశోధన చేపట్టింది. మన దేశంలోనే సముద్రాల నుంచి సమృద్ధిగా లభించే సోడియం నుంచి సోడియం అయాన్‌ బ్యాటరీల రూపకల్పనలో పురోగతి సాధించింది. లిథియం సల్ఫర్, సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలపైనా ఏఆర్‌సీఐ పరిశోధనలు చేస్తోంది.

సోడియం అయాన్‌ బ్యాటరీలు : విద్యుచ్ఛక్తిని నిల్వ చేసుకునేందుకు సోడియం అయాన్‌ బ్యాటరీ రూపకల్పనలో క్యాథోడ్‌ మెటీరియల్స్‌గా సోడియం వనేడియం ఫాస్ఫేట్‌ను ఉపయోగించి ఏఆర్‌సీఐ పరిశోధనలు చేస్తోంది.

  • సముద్రపు నీటి నుంచి సోడియం ఉత్పత్తి చేయవచ్చు.
  • లిథియం అయాన్‌తో పోలిస్తే చౌకలో తయారు చేయవచ్చు. అయితే శక్తి నిల్వ ఇందులో తక్కువగా ఉండటం ఓ ప్రతికూల అంశం. చౌక కాబట్టి సౌర విద్యుత్‌ను నిల్వ చేసేందుకు లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల స్థానంలో వీటిని వినియోగించేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల కంటే ఎక్కువ నిల్వ సామర్థ్యం వీటికి ఉందని పేర్కొంటున్నారు.
  • 'ద్విచక్ర వాహనాలపై రోజుకు గరిష్ఠంగా 70 నుంచి 80 కిలోమీటర్లకు మించి తిరగరు. కాబట్టి వీటికి సోడియం అయాన్‌ బ్యాటరీలు ఉపయోగకరం. ట్రక్కులు, బస్సుల్లోనూ ఎక్కువ లోడ్‌లో బ్యాటరీల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీటిలోనూ ఉపయోగించవచ్చు’ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఎక్కువ నిల్వ సామర్థ్యానికి లిథియం సల్ఫర్‌తో :

  • మరో ప్రత్యామ్నాయంగా లిథియం సల్ఫర్‌తో బ్యాటరీల రూపకల్పనపై ఏఆర్‌సీఐ పరిశోధనలు చేస్తోంది.
  • అధిక శక్తి సాంద్రత, నిర్దిష్ట సామర్థ్యం కారణంగా వీటిని ప్రత్యామ్నాయాలుగా పేర్కొంటున్నారు.
  • ఇందులో ప్రతికూలత ఏంటంటే తక్కువసార్లు మాత్రమే రీఛార్జ్‌ చేసుకోగలరు. బ్యాటరీ త్వరగా డెడ్‌ అయిపోతుంది. ఎక్కువసార్లు రీఛార్జ్‌ చేసుకునేలా బ్యాటరీ సైకిల్స్‌ను పెంచే పరిశోధనలను ఏఆర్‌సీఐ చేస్తోంది.
  • ఒక ఫుల్‌ఛార్జ్, ఫుల్‌ డిశ్ఛార్జి అయితే ఒక సైకిల్‌ అంటారు. ఇలాంటి 500 సైకిల్స్‌ ఉండే వాటిని అభివృద్ధి చేశారు.
  • ఈ సైకిల్స్‌ 2000 నుంచి 3000 వరకు ఉంటే ఉపయోగకరం. 5000 సైకిల్స్‌ వరకు తీసుకెళ్లాలనేది ఏఆర్‌సీఐ లక్ష్యం.

బ్యాటరీల జీవితకాలం పెంచేలా : ఫ్యూచరిస్టిక్‌ మెటీరియల్స్‌పై దృష్టి పెట్టామని ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్‌ ఆర్‌.విజయ్ పేర్కొన్నారు. సోడియం అయాన్, లిథియం సల్ఫర్‌ సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలపై పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. సోడియం అయాన్‌లో కిలోగ్రాం స్థాయిలో ఇప్పటికే ఉత్పత్తి జరిగిందని తెలిపారు. 10 కిలోలు, 20 కిలోల బ్యాచ్‌లో తయారీపై పరిశోధనలు కొనసాగుతున్నట్లు వివరించారు. సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు మన వాతావరణానికి అనుకూలమని ఇందులో లిక్విడ్‌ ఉండదు కనుక పేలుడు వంటి సమస్యలు రావని తెలియజేశారు. వీటిపై పరిశోధనలు చేస్తున్నామని అన్నారు. లిథియం సల్ఫర్‌ బ్యాటరీల జీవితకాలం పెంచేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్‌ ఆర్‌.విజయ్ వెల్లడించారు.

ఎలక్ట్రికల్ వాహనా​లలో బ్యాటరీ పేలుళ్లకు చెక్ - సరికొత్త ఏఐ ఈ-బైక్ తయారుచేసిన విట్​ విద్యార్థులు - E Bike Designed by Prayana Startup

విద్యుత్​ను దాచుకుందాం- అవసరమైనప్పుడు వాడుకుందాం! ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం - Battery Storage Projects In AP

ABOUT THE AUTHOR

...view details