APSRTC Special Buses for Karthika Masam :హిందూ పురాణాల్లో కార్తిక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయాలన్నీ దీపాల కాంతుల్లో కళకళలాడుతుంటాయి. అత్యంతపవిత్రమైన కార్తిక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇది నవంబర్ 30న ముగుస్తుంది. ఈ నెలలో పరమ శివుడికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ నెలలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తోంది. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ సత్యనారాయణ పేర్కొన్నారు.
పంచారామ క్షేత్రాలకు : అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి పంచారామ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చే నెల 2 నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆదివారం డిపో నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరుతాయి. అమరావతి, భీమవరం, ద్రాక్షారామ, పాలకొల్లు, సామర్లకోట ఆలయాలకు తీసుకెళ్తారు. వచ్చేనెల 2, 3, 9, 10, 16, 23, 24 తేదీల్లో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
మన్యసీమ దర్శిని : ఈ బస్సులను వచ్చేనెల 3, 10, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 5 గంటలకు డిపో నుంచి బయల్దేరి రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటాయి. ర్యాలి మోహిని అవతార కేశవస్వామి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి, సీతపల్లి బాపనమ్మ గుడి, రంప పురాతన శివాలయం, రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ ఆలయం, మారేడుమిల్లి కాఫీ తోటలు, ఔషధ మొక్కలు, రబ్బరు తోటలు, జలతరంగిణి జలపాతం, పాములేరు వాగు సందర్శన ఉంటుంది.